జిల్లాకు చేరిన బ్యాలెట్ ల ముద్రణ కోసం వినియోగించే పేపర్లు
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
గుర్తులు ఖరారు.. బ్యాలెట్‌లో ‘నోటా’కు చోటు
ముద్రణ కోసం జిల్లాకు చేరినప్రత్యేక పేపర్
బ్యాలెట్ బాక్స్‌లు సైతం సిద్ధం
నోడల్ అధికారుల నియామకం
జిల్లాలో 491 జీపీలు, 4,350 వార్డులు
రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను వేగిరం చేసింది. గతేడాది ఫిబ్రవరి నెలలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామ పంచాయతీలు కొనసాగుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు ఓటరు జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాల కేటాయింపు పూర్తయింది. అలాగే ఆయా విభాగాలకు నోడల్ అధికారులను నియమించారు. ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు కేటాయించే గుర్తులను ప్రకటించారు. అలాగే వీటితో పాటు నోటాకు సైతం చోటు కల్పించారు. జిల్లాలో 491 గ్రామ పంచాయతీలు, 4,350 వార్డులు ఉండగా మొత్తం ఓటర్లు 6,23, 813 మంది ఉన్నారు.
సాక్షి, సిద్దిపేట: పార్టీ రహితంగా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పల్లె ప్రజలకు తెలిసిన గుర్తులను ప్రకటించారు. సర్పంచ్‌కు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులను గుర్తించారు. సర్పంచ్‌కు ఉంగరం, కత్తెర , బ్యాటు, చెత్తడబ్బా, కొబ్బరితోట, లేడీపర్సు, పాన, టూత్‌పేస్ట్, టీ జల్లెడ, వజ్రం, బకెట్, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ, లైట్, పడవ, బిస్కెట్, చేతికర్ర, గాలి బుడగ, చైన్, వేణువు, నల్ల బోర్డు, ఫుట్‌బాల్, బాట్స్‌మెన్, స్టంప్స్, బెండకాయ, చెప్పులు, హ్యాండిల్, బ్రష్‌లను గుర్తించారు. వార్డు సభ్యుల కోసం గాజుగ్లాసు, పోస్టుడబ్బా, మూకుడు, హాకి కర్రబంతి, కవర్, విద్యుత్ స్తంభం, కేటిల్, కటింగ్ ప్లేయర్, పెట్టె, గౌను, గ్యాస్ పొయ్యి, గ్యాస్ సిలిండర్, ఈల, ఐస్‌క్రీం, కుండ, డిష్‌యాంటినా, గరాటా, బీరువా, నెక్‌టై, స్టూల్‌లను గుర్తులను నిర్ణయించారు. పోటీలోని అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే నోటాకు ఓటు వేయవచ్చు. పార్లమెంట్, శాసన సభ ఎన్నికల్లో బ్యాలెట్ యూనిట్ చివరలో నోటా ఉన్నట్లే ఈ ఎన్నికల్లోనూ నోటా గుర్తు ఉండనుంది.
అధికారుల నియామకం
ఎన్నికల నిర్వహణకు 12 విభాగాల కోసం 18 మంది నోడల్ అధికారులను నియమించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా అధికారులకు బాధ్యతలను అప్పగించారు. జిల్లా స్థాయిలో వివిధ శాఖల అధికారులు ఎన్నికలు విధులు నిర్వర్తించనున్నారు. అలాగే త్వరలో నామినేషన్‌ల స్వీకరణ కోసం ఆర్‌ఓలను గ్రామ పంచాయతీల వారీగా గెజిటెడ్ అధికారులను నియమించనున్నారు. పీఓ, ఏపీఓ, పోలింగ్ క్లర్క్‌లను సైతం నియమించి వారికి శిక్షణ ఇవ్వనున్నారు.
సర్పంచ్‌కు పింక్..
సర్పంచ్ కోసం పింక్ కలర్, వార్డు సభ్యుల కోసం తెలుపు రంగు కాగితాలపై ముద్రించనున్నారు. ఇప్పటికే బ్యాలెట్ ముద్రణ కోసం జిల్లాకు ప్రత్యేక పేపర్ వచ్చింది. పింక్ కలర్‌వి 53 బ్యాగ్‌లు, వైట్ కలర్‌వి 70బ్యాగ్‌లలో వచ్చిన పేపర్లను స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ముద్రణకు టెండర్లు జిల్లా స్థాయిలో పిలవనున్నారు. బ్యాలెట్ బాక్స్‌లు సైతం సిద్ధంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment