మరో 10 వేల మందికి ‘రక్షణ’
● రూ.17 కోట్లతో బతుకమ్మ ఘాట్, చెరువుల అభివృద్ధి ● మంత్రి పొన్నం ప్రభాకర్ ● ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన
హుస్నాబాద్: రెండో విడత మరో 10 వేల మంది గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పట్టణంలో ఆదివారం రూ.26.60 కోట్ల వ్యయంతో ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు, కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణాలకు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదటి విడతగా 15 వేల మంది గీత కార్మికులకు రక్షణ కవచాలు పంపిణీ చేశామన్నారు. ఈ నెల 25లోగా రెండో విడతగా కాటమయ్య రక్షణ కవచాలను పంపిణీ చేస్తామన్నారు. హుస్నాబాద్ ప్రాంతానికి తలమానికమైన ఎల్లమ్మ చెరువును అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే మరో రూ.17 కోట్ల వ్యయంతో ఆరపల్లె చెరువు బతుకమ్మ ఘాట్, పల్లె చెరువు, కొత్త చెరువు సుందరీకరణ పనులు చేపడతామన్నారు. ఎల్లమ్మ చెరువు నుంచి పందిల్ల వరకు రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.
రైతు సంక్షేమానికే రైతు భరోసా
రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, రైతు భరోసా కింద ఎకరాకు రూ.12వేలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఈ నెల 26 నుంచి నూతన రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్ పర్సన్ అయిలేని అనిత, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఆర్డీఓ రామ్మూర్తి, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment