భవిష్యత్తు అంతా యువతదే..
● కాంగ్రెస్ అన్యాయాలపై ప్రజా చైతన్యం ● పనులు జరిగే వరకు పోరాటం ● ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపు
సిద్దిపేటజోన్: భవిష్యత్తు అంతా యువతదేనని, యువత రాజకీయాల్లో ముందు వరుసలో ఉండాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నంగనూర్ మండల యువజన విభాగం నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువతకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా చైతన్యం తీసుకురావాలన్నారు. కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలో ఎగవేతలు, కోతలు తప్ప పాలనపై పట్టు లేదని విమర్శించారు. ఆరు గ్యారంటీలను అటకెక్కించారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో సిద్దిపేట ఎడారిగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడి మంజూరు అయిన నిధులను రద్దు చేయడం, జరుగుతున్న పనులను ఆపడం లాంటివి చేస్తోందని విమర్శించారు. ప్రగతికి సంబంధించిన నిధులు సాధించే వరకు పోరాటం చేస్తానని అన్నారు. రద్దు చేసిన పనులు తిరిగి ప్రారంభం అయ్యే వరకు కాంగ్రెస్ ను వదిలేది లేదన్నారు. ఇదే విషయాన్ని యువత ప్రజలకు వివరించి ఏడాదిలో జరిగిన అన్యాయాన్ని అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో సీనియర్ నాయకుడు భుపేష్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారిణికి అభినందనలు
చిన్నకోడూరు(సిద్దిపేట): షాట్‌పుట్ క్రీడా పోటీల్లో మెట్‌పల్లి గ్రామానికి చెందిన క్రీడాకారిణి సింగిరెడ్డి సిరిచందన ప్రతిభ చూపింది. రాష్ట్ర స్థాయిలో మూడవ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆదివారం క్రీడాకారిణిని సన్మానించి అభినందించారు. తన సంపూర్ణ సహకారం ఉంటుందని, భవిష్యత్‌లో ఇంకా ఉన్నత స్థాయిలో ఎదగాలని హరీశ్ ఆకాంక్షించారు. సిరిచందన తల్లిదండ్రులు, నాయకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment