‘లక్ష డప్పుల’తో సత్తా చాటుతాం
● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ● గజ్వేల్‌లో మాదిగల ఆత్మీయ సమ్మేళనం
గజ్వేల్: ‘లక్ష డప్పులు– వెయ్యి గొంతుకలు’ కార్యక్రమంతో సత్తా చాటుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం గజ్వేల్‌లో నిర్వహించిన మాదిగ– ఉప కులాల ఆత్మీయ సమ్మేళనానికి ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ కాశీం, ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న, జాతీయ మాదిగ కళామండలి అధ్యక్షుడు అశోక్‌లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సుప్రీం కోర్టులో వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం కుట్రలో భాగమేనన్నారు. రేవంత్‌రెడ్డి వ్యక్తిగతంగా వర్గీకరణకు అనుకూలంగా ఉన్నా.. కుట్రలతో కొందరు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఫిబ్రవరి 3న నగరంలో నిర్వహించనున్న ‘లక్ష డప్పులు– వెయ్యి గొంతుకలు’ కార్యక్రమంతో కుట్రలన్నీ ఛేదిస్తామని హెచ్చరించారు. ఉద్యమిస్తున్న మందకృష్ణకు మనమంతా అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. వర్గీకరణ ప్రజాస్వామిక ఆకాంక్ష కార్యరూపంలోకి వచ్చేంతవరకు విశ్రమించవద్దన్నారు. ప్రజాగాయకుడు, బహుజన యుద్దనౌక ఏపూరి సోమన్న, జాతీయ మాదిగ కళామండలి అధ్యక్షులు ఆశోక్‌ల ఆట, పాట విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మాదిగ జేఏసీ నాయకులు బొల్లారం ఎల్లయ్య, మల్లేశం, చేబర్తి యాదగిరి, నాగభూషణం, పొట్ట యాదగిరి, కుమార్, రాములు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాగా అంతకుముందు పట్టణంలో డప్పుచప్పుళ్లు, నృత్యాలతో ర్యాలీ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment