ఆత్మీయ భరోసా కొందరికే!
జిల్లాలో భూమిలేని వారు 18వేలకుపైగా గుర్తింపు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొందరికే అందనుంది. వ్యవసాయ కూలీలకు చేయూత అందించేందుకు ఏడాదికి రూ.12వేల ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. అర్హుల ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా భూమి లేనివారు 18,882 కుటుంబాలున్నాయని ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. భూమి లేనివారికే కాకుండా ఎకరంలోపు వ్యవసాయ భూమి ఉన్న వారికి సైతం రైతు భరోసాతో పాటు ఆత్మీయ భరోసా అందించాలని రైతులు కోరుతున్నారు.
సాక్షి, సిద్దిపేట: వ్యవసాయ కూలీలకు ఈ నెల 26 నుంచి అమలు చేయనున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం గ్రామీణ ఉపాధి కింద 20 రోజుల పని దినాలు చేసిన వారికి అందించాలన్న నిబంధన పెట్టారు. జిల్లాలో 1,99,540 జాబ్ కార్డులున్నాయి. అందులో 20 రోజులు పని దినాలు చేసిన కుటుంబాలు 75,187 మంది ఉన్నారు. కానీ ఇందులో వ్యవసాయ భూమి లేనివారుగా 18,882 కుటుంబాలను గుర్తించారు. ఆయా మండలాల్లో లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌ల నంబర్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల జాబితాను ఫైనల్ చేయనున్నారు. అర్హులైన వారికి మొదటి విడతగా ఈ నెల 26 నుంచి రూ.6వేల చొప్పన బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేయనున్నారు.
రెండు పథకాలూ వర్తింపజేయాలి..
ఎకరం భూమి లోపు ఉన్న నిరుపేద కుటుంబాలకు రైతు బరోసాతో పాటు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అందజేయాలని రైతులు కోరుతున్నారు. ఉదాహరణకు 10 గుంటల వ్యవసాయ భూమి ఉన్న రైతుకు ఏడాదిలో రెండు విడతలకు కలిపి రూ.3,000 మాత్రమే రైతు భరోసా వస్తుంది. అదే భూమి లేని వ్యవసాయ కూలీకి ఏడాదికి రూ.12వేలు ఆత్మీయ భరోసా అందనుంది. ఇలా పేద రైతులకు కొంత అన్యాయం జరగనుంది. ప్రభుత్వం పెట్టిన నిబంధనతో జిల్లాలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యవసాయ కూలీలకు నష్టం జరుగనుంది. ఉపాధి హామీ పథకంలో కూలీకి వెళ్లి పొట్టపోసుకునేది ఎక్కువగా పేద కూలీలే ఉన్నారు. ఇప్పటికై న ప్రభుత్వం స్పందించి నిబంధనలు సడలించి పేద వ్యవసాయ రైతులకు సైతం ఆత్మీయ భరోసాను వర్తింపజేయాలని కోరుతున్నారు.
ఈ నెల 21 నుంచి గ్రామ సభల్లోలబ్ధిదారుల ఎంపిక
20 రోజులు పనిదినాలు పూర్తి చేసుకున్నది 75వేల కుటుంబాలు
రెండు పథకాలు వర్తింపజేయాలంటున్న పేద రైతులు
పేద రైతులందరికీ భరోసా ఇవ్వాలి
పది గుంటల భూమి ఉంది. ఉపాధి హామీ పథకంలో పని చేస్తూ ఉపాధి పొందుతున్నాం.ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఎకరం లోపు ఉన్నవారందరికీ ఇవ్వాలి. మాలాంటి పేదలకు ప్రభుత్వ పథకాలు అందించాలి.
– అండాలు, తిగుల్, జగదేవపూర్
రెండు పథకాలు అమలు చేయాలి
మూడు గుంటల వ్యవసాయ భూమి ఉంది. రైతు భరోసా పథకం ద్వారా ఏడాదికి కేవలం రూ. 900 మాత్రమే వస్తాయి. అందువల్ల రైతు భరోసాతో పాటు ఆత్మీయ భరోసా కూడా అందించాలి. దీంతో నాలాంటి వారు లబ్ధి పొందుతారు.
– మేడి చెలిమి భాస్కర్, బైరాన్ పల్లి
పేదలందరికి ఇస్తేనే మేలు..
మాకు 13గుంటల వ్యవసాయ భూమి వుంది. రైతు భరోసా కింద రూ.3వేలు ఇచ్చి, భూమిలేని కూలీలకు రూ.12 వేలు ఇస్తే ఎట్లా? నేను ఉపాధి పనికీ వెళ్తా. రైతు భరోసాతో పాటు, ఆత్మీయ భరోసా ఇవ్వాలి. పేద రైతులను ఆదుకోవాలి.
– విజయ, గాంధీనగర్, హుస్నాబాద్
Comments
Please login to add a commentAdd a comment