నేడే మల్లన్న ‘పట్నం వారం’
ఆదివారం శ్రీ 19 శ్రీ జనవరి శ్రీ 2025
● బ్రహ్మోత్సవాలకు కొమురవెల్లి సర్వంసిద్ధం ● మహాజాతరకు తరలిరానున్న లక్షలాదిమంది భక్తులు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయం.. బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మొదటి వారాన్ని పట్నం వారంగా పిలుస్తారు. మూడు నెలల పాటు జాతర కొనసాగనుంది. ఈ క్రమంలో మొదటి ఆదివారం హైదరాబాద్‌కు చెందిన భక్తులు మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలనుంచి భక్తులు లక్షలాదిగా తరలిరానున్నారు. సోమవారం తోట బావివద్ద నగరానికి చెందిన భక్తులు నిర్వహించే పెద్ద పట్నం, అగ్నిగుండాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
మొదలైన భక్తుల రాక
కొమురవెల్లికి భక్తుల రాక మొదలైంది. నేరుగా స్వామివారిని ధూళి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీఐపీల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం సుమారు 80 వేల లడ్డూలను తయారు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు రానుండటంతో భారీ ఏర్పాట్లు చేశారు.
స్పెషల్ బస్సులు..
మల్లన్న జాతరకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ అధికారులు స్పెషల్ బస్సులు నడిపిస్తున్నారు. అన్ని రూట్ల నుంచి కొమురవెల్లికి చేరుకునేలా బస్సులను ఏర్పాటు చేశారు.
పటిష్ట బందోబస్తు: సీపీ
బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ అనురాధ తెలిపారు. ఈ మేరకు శనివారం బందోబస్తు విధులు నిర్వహించే పోలీసులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. పట్నం వారానికి 510 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సుమారు 80 సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నట్ల తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment