ప్రొటోకాల్ రగడ
దుబ్బాక/మిరుదొడ్డి : ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ పర్యటన ఉద్రిక్తత మధ్య కొనసాగింది. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రొటోకాల్ తెరపైకి రావడంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య వాగ్యుద్దానికి దారి తీసింది. కొద్దిసేపు తోపులాటకు దారి తీసింది. బీఆర్‌ఎస్ నాయకులు ఒక దశలో మంత్రి కాన్వాయ్ వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించి అందోళనకు దిగారు. దీంతో ప్రారంభోత్సవ కార్యక్రమం ఒక్క సారిగా ఉత్కంఠకు దారి తీసింది.
ప్రొటోకాల్‌పై వాగ్వాదం..
అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలో అత్యాధునిక హంగులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందు కొందరు బీఆర్‌ఎస్ నాయకులు ప్రొటోకాల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏసీపీ మధు కల్పించుకుని ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమమని సజావుగా సాగేలా సహకరించాలని కోరారు. ప్రభుత్వ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఏ హోదాతో పాల్గొంటున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ఎదురు ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు కల్పించుకుని ఏ హోదాతో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పాల్గొంటున్నారని వాగ్వాదానికి దిగారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.
పోటాపోటీగా నినాదాలు..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించే సమయంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యేకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఇరు పార్టీల నాయకులు పరస్పర నినాదాలు హోరెత్తడంతో చివరికి తోపులాటకు దారి తీసింది. ఒక దశలో మంత్రి కాన్వాయ్ బయటకు వెళ్ళకుండా బీఆర్‌ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. నాయకులను అక్కడి నుంచి తరలించడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. చివరికి మంత్రి కాన్వాయ్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
అభివృద్ధిని అడ్డుకుంటే సహించం : మంత్రి కొండా సురేఖ
మిరుదొడ్డి(దుబ్బాక): అభివృద్ధిని అడ్డుకుంటే సహించబోమని, అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయం పాటించాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. మండల కేంద్రమైన మిరుదొడ్డిలో దుబ్బాక, మిరుదొడ్డి, దౌల్తాబాద్, తొగుట, అక్బర్‌పేట–భూంపల్లి మండలాలకు చెందిన 316 మంది లబ్ధిదారులకు రూ.3.16 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి శనివారం పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేస్తామన్నారు. ప్రజాసంక్షేమ పథకాలన్నీ అర్హులకందే విధంగా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.
పోలీస్ పహారాలో చెక్కుల పంపిణీ
మండల కేంద్రంలో నిర్వహించిన చెక్కుల పంపిణీకి పొలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ బీఆర్‌ఎస్ నాయకులు కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఎక్కడ అంటూ నిరసనలు హోరెత్తించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు మరోసారి పరస్పర నినాదాలు అందుకున్నారు. దీంతో మంత్రి కొండా సురేఖ అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు వెనక్కి తగ్గడంతో పోలీసుల పహారాలోనే చెక్కులను పంపిణీ చేసి వారు వెనుదిరిగి వెళ్ళిపోయారు.
ప్రతీసారి ఇది సరికాదు
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రజలకు సేవ చేయడానికి జిల్లాకు వచ్చిన ప్రతిసారీ గొడవ పెట్టడం సరికాదని మంత్రి కొండా సురేఖ అన్నారు. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి మంత్రి ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇలా రాద్దాంతం చేయడం సరికాదన్నారు. గతంలో బీఆర్‌ఎస్ పాలనలో ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావును ప్రభుత్వ కార్యక్రమాలకు పిలువలేదని, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అప్పుడు లేని ప్రొటోకాల్ ఇప్పుడు గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు. ఆమె వెంట నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఉద్రిక్తత మధ్య మంత్రి సురేఖ పర్యటన
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య వాగ్యుద్ధం
రసాభాసగా మారిన ప్రారంభోత్సవ కార్యక్రమం
Comments
Please login to add a commentAdd a comment