మల్లన్న ఆదాయం రూ.43.28లక్షలు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయానికి పట్నంవారం (మొదటి ఆదివారం) రూ.43,28,742 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు. మొత్తం మూడు రోజుల ఆదాయమని చెప్పారు. స్వామివారికి భక్తులు వివిధ రకాల మొక్కులు, దర్శనాలు, లడ్డూ ప్రసాదాల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు తెలిపారు. గత ఏడాది మూడో వారానికి రూ. 55.70లక్షలు సమకూరగా, ఈసారి రూ.12,41,722 తక్కువగా ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ రామాంజనేయులు తెలిపారు.
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్
హుస్నాబాద్: కొత్తగా మహిళా సంఘాల ఏర్పాటు, బ్యాంక్ రుణాల పంపిణీ పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం మెప్మా ఆర్‌పీలతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా తీసుకునే రుణాలతో మహిళలు ఆర్థికంగా రాణించాలన్నారు. డబ్బులు వృథా చేయకుండా స్వయం ఉపాధి కోసం వినియోగించుకోవాలన్నారు. బ్యాంకర్లకు మహిళలపై నమ్మకం ఉండేలా రుణాలను కూడా సకాలంలో చెల్లించాలన్నారు. కార్యక్రమంలో పీడీ హన్మంతరెడ్డి, ఏడీఎంసీ సంతోషి, టీఎంసీ ముత్యాలరాజు, ఆర్‌పీలు ఉన్నారు.
యూజీడీ లీకేజీలకు మరమ్మతులు
గజ్వేల్: ‘ముంచెత్తుతున్న మురుగు’ శీర్షికన యూజీడీ లీకేజీలపై ‘సాక్షి’లో గత నెల 31న ప్రచురితమైన కథనంపై గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ నర్సయ్య స్పందించారు. ఈ మేరకు పట్టణంలోని లక్ష్మీప్రసన్ననగర్ కాలనీలో యూజీడీ లీకేజీలకు మరమ్మతు చేయించారు. మంగళవారం స్వయంగా పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడటమే తమ కర్తవ్యమని అన్నారు.
ప్లాస్టిక్ రహితమే
లక్ష్యం కావాలి
మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్
సిద్దిపేటజోన్: ప్లాస్టిక్ రహిత సిద్దిపేటగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ సూచించారు. మంగళవారం పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. పట్టణంలో ప్లాస్టిక్ వాడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. స్టీల్ బ్యాంకు సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచించాలని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ప్లాస్టిక్ రహిత వస్తువుల పెళ్లి గురించి వివరించారు.
తీన్మార్ మల్లన్న ఫ్లెక్సీ దహనం
సిద్దిపేటజోన్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో రెడ్డి సంఘం నాయకులు నిరసన తెలిపారు. మంగళవారం ముస్తాబాద్ చౌరస్తాలో మల్లన్న ఫ్లెక్సీని దహనం చేశారు. వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు మమతారెడ్డి, ఆనంద్‌రెడ్డి, రాజలింగారెడ్డి, నరేందర్ రెడ్డి, రాజిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment