రహదారుల నిర్మాణానికి రూ.44.38 కోట్లు
మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్: నియోజకవర్గంలో బీటీ, సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణాలకు వివిధ గ్రాంట్స్ నుంచి రూ.44.38 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడా మట్టి రోడ్లు ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రులకు పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.
రూ.25లక్షలపరిహారం ఇవ్వాలి
మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి
అక్కన్నపేట(హుస్నాబాద్): గోవర్ధనగిరిలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా మృతి చెందిన బాధిత కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బండరాళ్లు పడి మృత్యువాత పడిన బాధిత కుటుంబాలకు రూ. 25లక్షలు, తీవ్రంగా గాయపడిన కుటుంబాలకు రూ.15లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి భాస్కర్, మల్లేశ్, నాయకులు పాల్గొన్నారు.
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
జిల్లా వైద్యాధికారి పల్వాన్‌కుమార్
జగదేవ్‌పూర్(గజ్వేల్): ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని జిల్లా వైద్యాధికారి పల్వాన్‌కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన జగదేవ్‌పూర్, తిగుల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అలాగే రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగదేవ్‌పూర్, తిగుల్ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య భేష్ అని కితాబు ఇచ్చారు. జగదేవ్‌పూర్‌లో ఫార్మాసిస్టు పోస్టు ఖాళీ ఉన్నందున త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శ్రీనివాస్, వైద్యులు పాల్గొన్నారు.
అసమానతలు వీడాలి
జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి
సిద్దిపేటజోన్: అంతరాలు, అసమానతలు లేని సమాజం కోసం పనిచేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక టీటీసీ భవన్‌లో బాలవికాస ఆధ్వర్యంలో నిర్వహించిన పిల్లల జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తోటి వారి పట్ల ప్రేమ, అనురాగాలతో ఉండాలన్నారు. ఈ సందర్భంగా అనాథ పిల్లలకు సంస్థ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో బాలవికాస ప్రతినిధులు పాల్గొన్నారు.
దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు
సిద్దిపేటకమాన్: దాడికి పాల్పడిన వ్యక్తిపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లికి చెందిన కేశబోయిన మల్లేశం తన భార్యతో కలిసి సుభాష్‌రోడ్డులో ఓ పండ్ల విక్రయ బండి వద్ద కొనుగోలు చేయడానికి ఆగారు. ఈ క్రమంలో మల్లేశం కొనుగోలు చేయకుండా వెళ్లిపోతుండగా విక్రయదారుడు దుర్బాషలాడాడు. దీంతో వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. మల్లేశంపై పండ్ల విక్రేత దాడికి పాల్పడగా తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment