వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 తుది అంకానికి చేరింది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా (66.67 శాతం పాయింట్లు), టీమిండియా (58.8) ఫైనల్‌కు చేరాయి. ఇరు జట్లు ఓవల్ మైదానం వేదికగా డబ్ల్యూటీసీ టైటిల్ (జూన్ 7 నుంచి 11 వరకు) కోసం తలపడతాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎడిషన్‌లో నమోదైన గణాంకాలను పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూసాయి.
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా, తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేసి పర్వాలేదనిపించగా.. రెండో స్థానంలో ఉన్న టీమిండియా గణాంకాలు ఏమంత ఆశాజనకంగా లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పాయింట్ల పట్టికలో సెకెండ్ ప్లేస్‌లో ఉన్నామనే మాట తప్పించి, టీమిండియా ఆటగాళ్లు దాదాపు అన్ని విభాగాల్లో స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయారన్నది బహిరంగ రహస్యం.
ప్రస్తుత ఎడిషన్‌లో అత్యధిక పరుగులు (జో రూట్ (1915)), అత్యధిక వికెట్లు (నాథన్ లియోన్ (83)), అత్యధిక సెంచరీలు (రూట్ (9)), అత్యధిక వ్యక్తిగత స్కోర్ (టామ్ లాథమ్ (252)), అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (అజాజ్ పటేల్ (10/119)), అత్యుత్తమ బ్యాటింగ్ సగటు (సౌద్ షకీల్, పాక్ (72.50)), అత్యధిక టీమ్ టోటల్ (ఇంగ్లండ్ 657), అత్యధిక రన్ ఛేజింగ్ (ఇంగ్లండ్ 378).. ఇలా అన్ని విభాగాల్లో భారత జట్టు ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు.
పై పేర్కొన్న విభాగాల్లో ఒక్కటంటే ఒక్కదాంట్లో కూడా టీమిండియా ఆటగాళ్లు టాప్‌లో లేరు. టీమిండియాతో పోలిస్తే, తక్కువ రేటింగ్ పాయింట్లు కలిగి, ఐదో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ జట్టు (46.97) అన్ని విభాగాల్లో మెరుగ్గా ఉంది. గత యాషెస్ సిరీస్‌లో వరుస ఓటముల తర్వాత కొత్త కెప్టెన్, కొత్త కోచ్ ఆధ్వర్యంలో అనూహ్యంగా పుంజుకున్న ఇంగ్లండ్ జట్టు.. బజ్‌బాల్ ఫార్ములాతో వరుస విజయాలు సాధించి, తొమ్మిదో స్థానం నుంచి ఐదో ప్లేస్‌కు ఎగబాకి సీజన్‌ను ముగించింది.
బౌలింగ్‌లో అశ్విన్ (13 మ్యాచ్‌ల్లో 61 వికెట్లు),
బ్యాటింగ్ విభాగంలో పుజారా (30 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, 6 హాఫ్ సెంచరీల సాయంతో 887 పరుగులు),
రిషబ్ పంత్ (21 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీల సాయంతో 868 పరుగులు),
విరాట్ కోహ్లి (28 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, 3 హాఫ్ సెంచరీల సాయంతో 869 పరుగులు),
జడేజా (19 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 673 పరుగులు),
అక్షర్ పటేల్ (14 ఇన్నింగ్స్‌ల్లో 4 హాఫ్ సెంచరీల సాయంతో 458 పరుగులు),
శుభ్‌మన్ గిల్ (7 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, హాఫ్ సెంచరీ సాయంతో 476 పరుగులు),
రోహిత్ (10 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 700 పరుగులు),
శ్రేయస్ అయ్యర్ (16 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, 5 హాఫ్ సెంచరీల సాయంతో 666 పరుగులు) ఓ మోస్తరుగా రాణించారు తప్పిస్తే పెద్దగా మెరుపులేవీ లేవు.
ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో పుజారా టీమిండియా టాపర్‌గా 18 స్థానంలో ఉన్నాడంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భారత జట్టు ఆటగాళ్లు ఇదే ఫామ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా ఆడితే, గత ఎడిషన్‌లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాభవమే ఎదురవ్వక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఆపసోపాలు పడి ఫైనల్‌కు చేరినందుకు గాను సంతోషించాలో లేక చెత్త గణాంకాలు నమోదు చేసినందుకు బాధపడాలో తెలియక టీమిండియా అభిమానులు లోలోపల మదనపడిపోతున్నారు. ఏదిఏమైనా జూన్‌లో జరుగబోయే ఫైనల్లో టీమిండియా గెలవాలని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment