నెల్లూరు(లీగల్): వ్యక్తి ఆత్మహత్య కేసులో అత్త, మామ, భార్యకి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ నెల్లూరు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి బి.లక్ష్మీనారాయణ మంగళవారం తీర్పు చెప్పారు. వివరాలు.. కరేటి వేణుగోపాల్ ఎంబీబీఎస్ విద్యార్థినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతని భార్య, అత్త, మామ అవమానాలకు గురిచేయడంతో భరించలేక పురుగుమందు తాగి రైలు కట్ట వద్ద ఆత్మహత్య చేసుకున్నట్లు నమోదైన కేసులో నిందితులైన మామ నావూరు వెంకటరమణయ్య, అత్త నావూరు మంజులమ్మ, భార్య నావూరు లక్ష్మీమాధురిపై ఆరోపణలు సాక్ష్యాధారాలతో రుజువైనందున పై మేరకు శిక్ష విధించారు. కరేటి వేణుగోపాల్ నెల్లూరు మాగుంట లేఅవుట్ ప్రాంతంలో సివిల్ ఇంజినీర్‌గా పనిచేసేవాడు.
నావూరి లక్ష్మీమాధురి స్థానిక ఏసీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. దువ్వూరు గ్రామానికి చెందిన వీరిరువురూ మనసులు కలిసి ప్రేమలో పడ్డారు. ఈ నేపథ్యంలో వీరు నెల్లూరు రూరల్ మండలం కొత్తూరులోని చర్చిలో 2019 జూన్ 8న పెద్దల అనుమతి లేకుండా వివాహం చేసుకున్నారు. వీరి వివాహ విషయాన్ని తెలుసుకున్న లక్ష్మీమాధురి తల్లిదండ్రులు వెంకటరమణయ్య, మంజులమ్మ తమ కుమార్తెను దువ్వూరు గ్రామానికి తీసుకెళ్లి తరువాత బుచ్చిరెడ్డిపాళేనికి కాపురాన్ని మార్చారు.
మెడికల్ కాలేజ్ హాస్టల్‌లో ఉన్న లక్ష్మీమాధురిని ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటనలతో మనస్తాపానికి గురైన కరేటి వేణుగోపాల్ 2019 అక్టోబర్ 20వ తేదీన బుచ్చిరెడ్డిపాళెంలో ఉన్న అత్త, మామ ఇంటికి వెళ్లి తన భార్య లక్ష్మీమాధురిని తన ఇంటికి పంపమని అడిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన వారు ‘మా అమ్మాయి నీతో రాదని’ గట్టిగా చెప్పారు. ఈ లోపు అక్కడికి వచ్చిన లక్ష్మీమాధురి మెడలో ఉన్న తాళిబొట్టును తీసి వేణుగోపాల్ మొహాన కొట్టింది. దీంతో వేణుగోపాల్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అనంతరం 2019 అక్టోబర్ 24వ తేదీన మెడికల్ కాలేజీలో లక్ష్మీమాధురిని కలిశాడు.
ఆ సమయంలో లక్ష్మీమాధురి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నీకు నాకు సంబంధం లేదు.. ఇక్కడికి రావద్దు’ అని గట్టిగా చెప్పింది. దీంతో వేణుగోపాల్ మాగుంట లేఅవుట్ సమీపంలోని రైలు కట్ట వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కొన ఊపిరితో ఉన్న వేణుగోపాల్‌ను తొలుత ఓ ఆస్పత్రికి తరలించగా జరిగిన ఘటనపై వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చైన్నెలోని విజయ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వేణుగోపాల్ చికిత్సపొందుతూ 2019 నవంబర్ 7న మృతిచెందాడు.
జరిగిన ఘటనలపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు వేణుగోపాల్ ఆత్మహత్యకు కారకులైన వెంకటరమణయ్య, మంజులమ్మ, లక్ష్మీమాధురిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం వీరిపై కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం న్యాయమూర్తి పై మేరకు తీరు చెప్పారు. కేసును దర్గామిట్ట పోలీసులు దర్యాప్తు చేయగా ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ నీరజారెడ్డి కేసు వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment