ఫోన్ పోయిందా.. డోంట్ వర్రీ
● బాధితులకు అండగా
మొబైల్ హంట్, సీఈఐఆర్
● గతేడాది ఫిబ్రవరి నుంచి వీటి సేవలు
● హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు
● ఏడు విడతల్లో రూ.8 కోట్ల విలువైన
ఫోన్ల అప్పగింత
3,040 ఫోన్లను రికవరీ చేశాం
సెల్‌ఫోన్‌లో నిక్షిప్తమైన సమాచారం, వ్యక్తిగత, కుటుంబ ఫొటోలు, వీడియోలు తదితరాలు అసాంఘిక వ్యక్తుల చేతిలో పడితే ప్రమాదం. దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ మొబైల్ హంట్ సేవలను, కేంద్ర ప్రభుత్వం సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటి ద్వారా జిల్లాలో వివిధ కారణాలతో ప్రజలు పోగొట్టుకున్న ఏడు విడతల్లో రూ.8.08 లక్షల విలువైన 3,040 సెల్‌ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశాం. మొబైల్ హంట్, సీఈఐఆర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
– జి.కృష్ణకాంత్, ఎస్పీ
నెల్లూరు(క్రైమ్): ప్రస్తుతం సెల్‌ఫోన్ అత్యంత కీలకమైంది. అనేక పనులు దీనితోనే ముడిపడి ఉన్నాయి. నగదు చెల్లింపులు చేయాలన్నా.. దేనికై నా దరఖాస్తు చేయాలన్నా.. ఎలాంటి సమాచారం తెలుసుకోవాలన్నా ఫోన్ చాలా ముఖ్యం. ఇది చోరీకి గురైతే పరిస్థితి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే కొన్నిసార్లు ఫిర్యాదు తీసుకునేవారు కాదు. దీంతో ఫోన్, అందులో ఉన్న సమాచారం పోయిందని బాధపడాల్సి వచ్చేది. అయితే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఫోన్లను వెతికి పెట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం గతేడాది ఫిబ్రవరిలో మొబైల్ హంట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికి ఏడు విడతల్లో రూ.8 కోట్ల విలువ చేసే మూడువేల సెల్‌ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఈఐఆర్ విధానం ద్వారా రూ.8 లక్షలు విలువైన 40 సెల్‌ఫోన్లను రివకరీ చేసి బాధితులకు ఇచ్చారు.
మొబైల్ హంట్‌లో ఇలా..
సెల్‌ఫోన్ పోగొట్టుకున్నవారు ముందుగా మొబైల్ హంట్ సెల్‌ఫోన్ నంబర్ 91543 05600కు వాట్సప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పంపాలి. వెంటనే జిల్లా పోలీస్ పేరున మీ వివరాల కోసం లింక్ వస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. గూగుల్ ఫారం ఓపెన్ చేసి ఫిర్యాదుదారుడి పేరు, చిరునామా, చోరీ/పోయిన తేదీ, సమయం, పోయిన స్థలం, ఫోన్ మోడల్, కంపెనీ, రంగు, ఐఎంఈఐ నంబర్, ఈ–మెయిల్ ఐడీ, ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పత్రం, పోయిన ఫోన్‌లో ఉపయోగించిన నంబర్, సమాచారం కోసం మరో ఫోన్ నంబర్, పోలీసుస్టేషన్ పరిధి తదితర వివరాలను నమోదు చేసిన వెంటనే ఫిర్యాదు నమోదవుతుంది. సైబర్ క్రైమ్ టెక్నికల్ విభాగం వారి వద్దనున్న సాంకేతిక పరిజ్ఞానంతో మొబైల్‌ను ట్రేస్ చేస్తారు.
సీఈఐఆర్‌లో నమోదు ఇలా..
కేంద్రం టెలికామ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రార్ (సీఈఐఆర్) విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫోన్ పోగొట్టుకున్న బాధితులు తొలుత స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. అనంతరం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఈఐఆర్.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ లింక్‌పై క్లిక్ చేయాలి. ఐఎంఈఐ నంబర్లు, కంపెనీ పేరు, మోడల్, మొబైల్ కొనుగోలుకు సంబంధించిన బిల్లును అప్‌లోడ్ చేయాలి. ఎక్కడ పోయింది? తదితర వివరాలు నమోదు చేయాలి. అంతా పూర్తయిన తర్వాత ఐడీ నంబర్ వస్తుంది. ఏ కంపెనీదైనా సీఈఐఆర్ విధానం దానిని పనిచేయకుండా చేస్తుంది. దీంతోపాటు కేసు ఛేదనలో పోలీసులకు ఉపయోగపడుతుంది. సెల్‌ఫోన్ దొరికిన తర్వాత బాధితుడు అదే వెబ్‌సైట్‌లోకి వెళ్లి అన్‌బ్లాక్/ఫౌండ్ మొబైల్ అనే లింక్‌పై క్లిక్ చేసి ఐడీ నమోదు చేయగానే ఫోన్ అన్‌బ్లాక్ అవుతుంది.
మొబైల్ హంట్ నంబర్ : 91543 05600
700 మొబైల్ ఫోన్ల అందజేత
వివిధ కారణాలతో ప్రజలు పోగొట్టుకున్న రూ.1.50 కోట్ల విలువైన 700 మొబైల్ ఫోన్లను పోలీసు అధికారులు రికవరీ చేశారు. మంగళవారం నగరంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ జి.కృష్ణకాంత్ చేతుల మీదుగా ఫోన్లను బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నెల్లూరు నగర, రూరల్ డీఎస్పీలు డి.శ్రీనివాసరెడ్డి, ఘట్టమనేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment