No Headline
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐ–టీడీపీ పేరుతో నీచంగా పెట్టిన పోస్టులు కనబడవా?. ఇటువంటి వారిపై కేసులు ఎందుకు నమోదు చేయరు’ అంటూ రాజంపేట ఎంపీ, వైఎస్సార్‌సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి నిలదీశారు. ఇటువంటి కేసులను దీటుగా ఎదుర్కొని ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే క్యాడర్‌కు అండగా ఉంటామన్నారు. నెల్లూరులోని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం జిల్లాలోని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీలతో, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో మిథున్‌రెడ్డి ఆత్మీయ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు అనేక రకాలుగా పోస్ట్‌లు పెట్టినా కూడా తాము వారిని వేధించలేదన్నారు. చంద్రబాబు మాటలకు ఎంత విలువ ఉంటుందో ప్రజలందరికీ తెలుసని, ఆయన మాటమీద నిలబడే వ్యక్తి కాదని ఇప్పటికే ప్రజలకు అర్థమైందన్నారు. అధికారంలోకి వస్తే వలంటీర్లకు రూ.10 వేలు జీతం ఇస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చాక వారి అవసరం లేదంటూ కూటమి మంత్రులే చెబుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు మరెన్ని యూటర్నులు తీసుకుంటారో వేచి చూడాలన్నారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో, కౌన్సిల్‌లో నిలదీసేందుకు వెనుకాడమన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే తమ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడే వీలు లేకుండా పోయిందన్నారు. తమ పార్టీ ఓడిపోయినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న క్యాడర్ ఎక్కడికీ పోలేదని అండగానే ఉందని స్పష్టం చేశారు. అభద్రతా భావం ఎక్కడా లేదని తామంతా కలిసి కట్టుగా పనిచేస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు అందరం కలిసికట్టుగా పని చేస్తామని, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.
● మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చో పెట్టడమే తమ లక్ష్యమన్నారు. అందుకు జిల్లాలో అన్ని స్థానాల్లో మరో సారి వైఎస్సార్‌సీపీ గెలిచే విధంగా మిథున్‌రెడ్డితో కలిసి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.
● మాజీ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీని బలోపేతం చేసుకుంటూ అందరం కలిసి కట్టుగా పనిచేస్తామన్నారు. సోషల్ మీడియాకు సంబంధించి అరెస్ట్‌లు చేసి ఈ ప్రభుత్వం శునకానందం పొందుతున్నారన్నారు. గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వారు అనేక పోస్టులు పెట్టారని, అప్పుడు తాము టీడీపీ మాదిరిగా కక్ష సాధింపు చర్యలకు దిగలేదన్నారు. వాటిని పట్టించుకుని ఉంటే ఇంతకు పదింతలు చర్యలు తీసుకునే అవకాశం ఉండేదన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తమ క్యాడర్ భయపడదని తామంతా వైఎస్ జగన్ వెంటే ఉంటామన్నారు. టీడీపీ తాటాకు చప్పుళ్లకు భయపడమని, చదువుకునే పిల్లలు, పార్టీకి మద్దతుగా ఉంటున్న వారిపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. దమ్ముంటే వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసిన అభ్యర్థుల మీద కేసులు పెట్టుకోండి. వాటిని తాము ఎదుర్కొంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మేరిగ మురళీతోపాటు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వెంకటగిరి ఇన్‌చార్జి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్‌చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి, సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment