జెడ్పీ సీఈఓ బాధ్యతల స్వీకరణ
నెల్లూరు (పొగతోట): జెడ్పీ సీఈఓగా విద్యారమ బాధ్యతలను గురువారం స్వీకరించారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ సీఈఓ మోహన్‌రావు తదితరులు కలిసి అభినందనలను తెలియజేశారు.
11న వాహనాల వేలం
నెల్లూరు(అర్బన్): వైద్య, ఆరోగ్య శాఖలో కాలవ్యవధి ముగిసిన రెండు వాహనాలను డిసెంబర్ 11న వేలం వేయనున్నామని డీఎంహెచ్‌ఓ పెంచలయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలానికి సంబంధించిన సాధారణ నిబంధనలు, షరతులు, సవరణలు, సమయ పొడిగింపు తదితరాలకు konugolu.ap. gov. inను పరిశీలించాలని కోరారు.
ఎన్‌సీసీ ఉత్తమ
అధికారిగా నరేంద్రబాబు
నెల్లూరు (టౌన్): ఎన్‌సీసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రస్ధాయి ఎన్‌సీసీ నావల్ యూనిట్ ఉత్తమ అధికారిగా గుండాల నరేంద్రబాబు ఎంపికయ్యారు. ఈ మేరకు 10 ఆంధ్రా నావల్ యూనిట్ ఎన్‌సీసీ నుంచి ఉత్తర్వులు గురువారం అందాయి. హైదరాబాద్ మెహదీపట్నంలోని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ఎన్‌సీసీ డైరెక్టరేట్‌లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మధుసూదన్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డును ఈ నెల 24న అందుకోనున్నారు. కాగా బీవీనగర్‌లోని కేఎన్నార్ హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన్ను హెచ్‌ఎం విజయప్రకాష్‌రావు ఉపాధ్యాయులు అభినందించారు.
ఆర్టీసీ బలోపేతానికి చర్యలు
నెల్లూరు సిటీ: ఆర్టీసీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణ పేర్కొన్నారు. నగరంలోని ఆర్టీసీ ప్రధాన బస్టాండ్ ప్రాంగణంలో సంస్థ నెల్లూరు జోన్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని త్వరలో కల్పించనున్నామని చెప్పారు. అదనపు బస్సులను ఏర్పాటు చేసి, చార్జీల తగ్గింపునకు కృషి చేస్తామని వివరించారు. సంస్థలో ఏడు వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం సురేష్‌రెడ్డి మాట్లాడారు. ఆర్టీసీ నెల్లూరు జోనల్ అధికారులతో సమన్వయం చేసుకొని అభివృద్ధి దిశగా చర్యలు చేపడతామని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రగతి పథంలో నడిపిస్తామని ప్రకటించారు. మారుమూల ప్రాంతాలకూ బస్సు సౌకర్యాన్ని కల్పించేలా చూస్తామని వివరించారు. తొలుత నగరంలోని అంబేడ్కర్ విగ్రహానికి సురేష్‌రెడ్డి నివాళులర్పించారు.
బస్సుల ప్రారంభం
నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో నాలుగు సూపర్ లగ్జరీ, ఒక ఎక్స్‌ప్రెస్ బస్సును కొనకళ్ల నారాయణ ప్రారంభించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌యాదవ్, ఆర్టీసీ నెల్లూరు జోన్ ఆర్‌ఎం మురళీబాబు, ఈడీ వెంకటేశ్వరరావు, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, బీజేపీ నేతలు వంశీరెడ్డి, సన్నపురెడ్డి దయాకర్‌రెడ్డి, భరత్‌కుమార్‌యాదవ్, కర్నాటి ఆంజనేయరెడ్డి పాల్గొన్నారు.
‘అపార్’పై సమీక్ష
నెల్లూరు (టౌన్): ఆటోమేటెడ్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్)ను వేగవంతం చేయాలని ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి ఆదేశించారు. వీఆర్సీ సెంటర్‌లోని రావూస్ డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో ఎంఈఓలు, ప్రదానోపాధ్యాయులు, క్లస్టర్ హెచ్‌ఎంలో సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. అపార్ నమోదులో జిల్లా వెనుకబడి ఉందని చెప్పారు. డీఈఓ బాలాజీరావు, నెల్లూరు డిప్యూటీ డీఈఓ ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment