జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి
● ఇన్‌చార్జి మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
● నుడా చైర్మన్‌గా శ్రీనివాసులురెడ్డి
ప్రమాణ స్వీకారం
నెల్లూరు(బారకాసు): నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ (నుడా) ద్వారా జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేయాలని ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ సూచించారు. మంగళవారం నెల్లూరులోని నుడా కార్యాలయ ప్రాంగణంలో చైర్మన్‌గా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. తొలుత నర్తకి సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించారు. నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ నుడా చైర్మన్‌గా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిచే ప్రమాణ స్వీకారం చేయించారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరాన్ని పరిశుభ్రమైన, సుందరమైనదిగా తీర్చిదిద్దటానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాకర్ల సురేష్, దగుమాటి వెంకటకృష్ణారెడ్డి, పనబాక లక్ష్మి, డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్‌కు అవమానం
నుడా చైర్మన్‌గా ప్రమాణ స్వీకారోత్సవాన్ని వైభవంగా నిర్వహించిన నేతలు దివంగత ఎన్టీఆర్‌ను విస్మరించారు. నర్తకీ సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి కనీసం ఒక పూలమాల వేసి నివాళులు కూడా అర్పించలేదు.
భూ ఆక్రమణలు జరగకుండా చట్టం
నెల్లూరు రూరల్: భూ ఆక్రమణలు జరగకుండా ప్రభుత్వం చట్టం తీసుకువస్తుందని, దీనికి సంబంధించి నియమ నిబంధనలు రూపొందిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ హాలులో జిల్లా మంత్రులు రామనారాయణరెడ్డి, నారాయణ, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్‌తో కలిసి ఆయన రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయం, డ్వామా, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ రెవెన్యూ భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం సదస్సులను అన్ని గ్రామాల్లో నిర్వహిస్తుందన్నారు. కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ రాళ్లపాడు రిజర్వాయర్ నుంచి రైతులకు పూర్తిస్థాయిలో నీటిని నేటి నుంచి అందించడానికి అన్ని చర్యలు చేపట్టామన్నారు. జిల్లాకు చెందిన పలువురు శాసనసభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment