గుండె గుబిల్లు | - | Sakshi
Sakshi News home page

గుండె గుబిల్లు

Published Fri, Dec 27 2024 7:28 PM | Last Updated on Fri, Dec 27 2024 7:55 PM

కరెంట్‌ చార్జీల సర్దుపోటు

కరెంట్‌ చార్జీల సర్దుపోటు

ఉమ్మడి జిల్లాలో నెలకు 320 కోట్ల యూనిట్ల వినియోగం

ట్రూఅప్‌ కింద యూనిట్‌పై రూ.1.50 చొప్పున పెరుగుదల

పదిహేను నెలల పాటు వసూలు

ఈ లెక్కన నెలకు రూ.450 కోట్ల బాదుడు?

నెల్లూరు జిల్లాలోనే రూ.6,750 కోట్లు

అయితే విద్యుత్‌ శాఖాధికారులు మాత్రం రూ.8 కోట్లే అని కాకి లెక్కలు

ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్‌కు మంగళం

వీరి నుంచి బలవంతంగా సోలార్‌ సౌకర్యానికి దరఖాస్తుల స్వీకరణ

11 లక్షల మంది విద్యుత్‌ వినియోగదారులకు షాక్‌

విద్యుత్‌ చార్జీల పెంపుపై నేడు వైఎస్సార్‌సీపీ పోరుబాట

జిల్లాలో కరెంట్‌ బిల్లులు చూస్తే.. వినియోగదారుల గుండెలు గుభేలు మంటున్నాయి. ప్రజల నుంచి వాస్తవంగా వసూలు చేసే ట్రూ అప్‌ చార్జీల మొత్తానికి విద్యుత్‌ శాఖాధికారులు కాకి లెక్కలు చెబుతున్నారు. తొలి విడత ట్రాఅప్‌ కింద విద్యుత్‌ చార్జీల పెంపు నవంబర్‌ నుంచే ప్రారంభం కావడంతో డిసెంబర్‌ బిల్లుల్లో చార్జీల మోత మోగుతున్నాయి. రెండో విడత కూడా ఈ నెల నుంచే ప్రారంభం కావడంతో వచ్చే నెలలో బిల్లులు ఏ స్థాయిలో వస్తాయో అని ప్రజలు ఇప్పటి నుంచే బెంబేలు ఎత్తుతున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచబోమని, చార్జీల భారాన్ని తగ్గిస్తామంటూ కోతలు కోసిన చంద్రబాబు.. ఐదు నెలలు తిరగక ముందే తన అసలు రూపాన్ని బయట పెట్టుకున్నారు. తాజాగా డిసెంబర్‌ నుంచి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇచ్చే ఉచిత కరెంట్‌ విధానానికి మంగళం పాడేశారు.

● దగదర్తి మండలం తడకలూరుకు చెందిన కూలి పనులు చేసుకునే ఒక పేదంటికి రెండు నెలల క్రితం వరకు 100 యూనిట్ల విద్యుత్‌ వినియోగానికి అన్ని చార్జీలు కలుపుకుని రూ.270 వస్తే.. ఈ నెలలో అవే యూనిట్లకు రూ.438 బిల్లు వచ్చింది. తనకు వచ్చే కూలి డబ్బులతో కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టంగా ఉందని విచారిస్తున్న ఆ కుటుంబ డిసెంబర్‌ బిల్లు చూసి గొల్లుమంటున్నారు.

● విడవలూరు దళితవాడకు చెందిన గోళ్ల మల్లికార్జున కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఫ్రీ బిల్లు వస్తోంది. అయితే నవంబర్‌ నెలలో ఆ కుటుంబం 40 యూనిట్లు మాత్రమే కరెంట్‌ వినియోగించింది. కానీ ఆ కుటుంబానికి రూ.721 బిల్లు వచ్చింది. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు ఉచితంగా ఇచ్చే కరెంట్‌ను కూటమి ప్రభుత్వం నవంబర్‌ నుంచి మంగళం పలికిందని బాధిత కుటుంబం వాపోతోంది.

● పొదలకూరు మండలం చెర్లోపల్లికి చెందిన సామాన్య రైతు ఎం.సుధాకర్‌రెడ్డి. ఆయన గృహ విద్యుత్‌ వినియోగం పరిశీలిస్తే విచిత్రంగా ఉంది. అక్టోబరులో వినియోగించిన 172 యూనిట్ల విద్యుత్‌ వినియోగానికి రూ.882 బిల్లు అందజేశారు. నవంబరులో 159 యూనిట్లే వినియోగించినా.. రూ.896 బిల్లు వచ్చింది. విద్యుత్‌ వినియోగం తగ్గితే బిల్లు కూడా తగ్గాలి. కానీ సుధాకర్‌రెడ్డికి బిల్లు పెరిగింది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో డిసెంబర్‌ నెలలో వచ్చిన విద్యుత్‌ బిల్లులు చూసిన వినియోగదారులు గుండెలు బాదుకుంటున్నారు. సామాన్యులకు కరెంట్‌ చార్జీల సర్దు‘పోటు’.. గుండెపోటు తెప్పించే విధంగా ఉన్నాయి. యూనిట్‌ వినియోగంపై రూ.1.50 వంతున పెరిగింది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా విద్యుత్‌ రంగంలో చేసిన అక్రమాల కారణంగా విద్యుత్‌ పంపిణీ సంస్థలపై పెనుభారం పడింది. దీనికి సంబంధించి అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ ప్రతిపాదనల మేరకు వినియోగదారులపై పెనుభారం పడకుండా, విద్యుత్‌ సంస్థలు పునర్జీవం సాధించేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఆ బిల్లులే అధికమంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు, కూటమి నేతలు గత ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచమని, అవసరం అయితే 30 శాతం మేర తగ్గిస్తామని హామీ ఇచ్చింది. కూటమి నేతల హామీలు నమ్మి గెలిపించిన ప్రజలకు అధికారంలోకి వచ్చిన ఐదు నెలలకే చుక్కలు చూపిస్తూ విద్యుత్‌ చార్జీల భారాన్ని మోపింది. విద్యుత్‌ సర్దుబాటు, ట్రూఅప్‌ పేరుతో వినియోగదారులపై చార్జీల మోత మోగిస్తోంది.

నెలకు రూ.450 కోట్ల భారం నిజమేనా?

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని కేటగిరీల్లో కలిపి 12,81,761 విద్యుత్‌ సర్వీసు కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 2,00,448 వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులకు సంబంధించి ట్రూఅప్‌ చార్జీలు మినహాయింపు ఉంది. మిగిలిన 10,81,313 సర్వీసులకు ట్రూఅప్‌ చార్జీల భారం పడుతోంది. జిల్లాలో అన్ని కేటగిరీల కనెక్షన్లకు సంబంధించి నెలకు 320 కోట్ల యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరుగుతోందని ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. విద్యుత్‌ అధికారులు చెప్పిన లెక్కన ప్రకారం చూస్తే.. యూనిట్‌పై రూ.1.50 పెరుగుతుంది. మొత్తం వినియోగంలో వ్యవసాయానికి 20 కోట్ల యూనిట్లు మినహాయించినా.. సగటున 300 కోట్ల యూనిట్లపై నెలకు దాదాపు రూ.450 కోట్ల భారం పడుతుందని అంచనా. ట్రాఅప్‌ చార్జీలను 15 నెలల పాటు వసూలు చేస్తారని విద్యుత్‌ శాఖాధికారులు చెబుతున్నారు. ఒక నెల్లూరు ఉమ్మడి జిల్లా పరిధిలోనే రూ.6,750 కోట్ల భారం పడుతుందని లెక్కలు చెబుతున్నాయి. అయితే విద్యుత్‌శాఖాధికారులు చెప్పే లెక్కలకు, వాస్తవానికి పొంతన లేకుండా ఉన్నాయి. నెలకు కేవలం రూ.8 కోట్ల భారం పడుతుందని చెబుతున్నారు. కాగా రెండో విడతలో కూడా ఇదే స్థాయిలో చార్జీల మోత మోగుతుందని అధికారులు చెబుతున్నారు. దీన్ని బట్టి రెండింతలు భారం పడే అవకాశం ఉందని అంచనా.

ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్‌కు మంగళం

ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు ఇప్పటి వరకు 200 యూనిట్ల విద్యుత్‌ వినియోగానికి ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం ఆ పథకానికి మంగళం పలికినట్లు స్పష్టమవుతోంది. నవంబరు నెల వినియోగానికి సంబంధించి డిసెంబర్‌లో వచ్చిన బిల్లులు చూస్తే.. మినిమం యూనిట్ల వినియోగానికి కూడా కూడా చార్జీలు వచ్చాయి. వీరికి ఇచ్చే ఉచిత విద్యుత్‌ను ఎగనామం పెట్టేందుకు ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్‌ ముఫ్ట్‌ బిజిలీ యోజన’ పథకాన్ని తెరపైకి తెచ్చారు. ప్రతి కుటుంబం సోలార్‌ విద్యుత్‌ వినియోగించుకోవాలని బలవంతంగా వారితో దరఖాస్తులు చేయిస్తున్నారు. లేదంటే బిల్లులు చెల్లించాల్సి వస్తుందని విద్యుత్‌ సిబ్బంది వారిపై ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది.

యూనిట్లు తగ్గినా..బిల్లు బాదుడు

అనంతసాగరం గ్రామానికి చెందిన రావమ్మ ఇంటికి విద్యుత్‌ వినియోగం తగ్గినా బిల్లు బాదుడు తప్పలేదు. ఆమె అక్టోబరు నెలలో 72 యూనిట్ల విద్యుత్‌ వినియోగించింది. ఇందుకు సంబంధించి రూ.282 బిల్లు వచ్చింది. నవంబరులో ఆమె 62 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించింది. అయితే బిల్లు మాత్రం రూ.320 వచ్చింది. అక్టోబర్‌, నవంబర్‌ నెలల బిల్లులు పరిశీలిస్తే.. నవంబర్‌ నుంచి యూనిట్‌పై రూ.1.25 వంతున పెరిగింది.

జిల్లాలో సర్వీసులు ఇలా..

కేటగిరీ–1 (గృహ సర్వీసులు) 9,42,905 

కేటగిరీ–2 (దుకాణాల సర్వీసులు) 1,07,800 

కేటగిరీ–3 (పరిశ్రమలు) 4,172 

కేటగిరీ–4 (స్ట్రీట్‌ లైట్లు, వాటర్‌ వర్క్స్‌) 26,436 

కేటగిరీ–5 (అగ్రికల్చర్‌) 2,00,448 

మొత్తం సర్వీసులు 12,81,761

షాక్‌ కొట్టేలా విద్యుత్‌ బిల్లులు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్రూఅప్‌ చార్జీల పేరుతో రూ.వేల కోట్లు పెంచి సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తోంది. గత ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఎలాంటి విద్యుత్‌ చార్జీలు పెంచమని, అవసనమైతే ఉన్న చార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మాట తప్పి రూ.15,485 కోట్లు విద్యుత్‌ చార్జీల పేరుతో పెంచి రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. – మూలం రమేష్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి

చంద్రబాబు ఓ మోసకారి

చంద్రబాబు ఓ మోసకారి. గత ఎన్నికల సమయంలో ఒక్క రూపాయి కరెంట్‌ చార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చాక రూ. వేల కోట్లు చార్జీలు పెంచాడు. గతంలో ఆయన చెప్పిన హామీలు ఏ ఒక్కటీ పూర్తి చేయలేదు. విద్యుత్‌ చార్జీలు పెంచడంతో పాటు స్మార్ట్‌ మీటర్ల పేరుతో విద్యుత్‌ సంస్థను అదానీకు కట్టబెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. విద్యుత్‌ చార్జీల పెంపుతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. - ఎస్‌కే మస్తాన్‌బీ, ఐద్వా జిల్లా కార్యదర్శి

నేడు వైఎస్సార్‌సీపీ పోరుబాట

నెల్లూరు(బారకాసు): రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15,485 కోట్ల విద్యుత్‌ చార్జీల భారాన్ని మోపాడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పోరుబాట నిర్వహించాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. డీఈలు, ఈఈ కార్యాలయాలు, సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నాలు, ర్యాలీలు, డిమాండ్‌ పత్రాల సమర్పణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పార్టీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement