మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
ఆధారాలు లేవని రిమాండ్‌ను తిరస్కరించిన న్యాయమూర్తి
సీఐ సుబ్బారావు, ఆర్‌ఐ రవి తప్పుడు ఆధారాలు సృష్టించారు
ఆ అధికారులను వదిలే ప్రసక్తే లేదు
వెంకటాచలం: అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వైఎస్సార్‌సీపీ బీసీ నేత, మాజీ జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్యను జైలు పాల్జేశారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆరోపించారు. జిల్లా జైల్లో ఉన్న వెంకటశేషయ్యను గురువారం కాకాణి ములాఖత్ ద్వారా పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఓ మహిళను అడ్డు పెట్టుకుని తప్పుడు కేసులు బనాయించడం సిగ్గు చేటన్నారు. శేషయ్యను అరెస్ట్ చేశాక తొలి రోజు మేజిస్ట్రేట్ దగ్గర హాజరు పరిస్తే ఆధారాలు లేవని వెనక్కి పంపితే, తప్పుడు పత్రాలు సృష్టించి రెండో రోజు జైలుకు పంపారన్నారు.
వెంకటాచలంలోని ఆ మహిళ అత్తమామలు వెంకటమ్మ, పెంచలయ్య నివాసంలో ఆమె కోడలు చేత ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకాలు చేసినవి ఉన్నట్లుగా శేషయ్య తెలిపితే సీఐ సుబ్బారావు వెళ్లి ఆ స్టాంప్ పేపర్లు అడిగితే వారు ఇచ్చినట్లుగా క్రియేట్ చేశారన్నారు. ఆ తప్పుడు పంచనామాను ఆర్‌ఐ రవికుమార్ ఆ ప్రదేశానికి వెళ్లకుండానే వెళ్లినట్లుగా చూపి ధ్రువీకరించి కోర్టుకు సమర్పించి శేషయ్యను దుర్మార్గంగా జైలుకు పంపారని మండి పడ్డారు. ఆ రోజు వెంకటమ్మ, పెంచలయ్య వెంకటాచలంలో లేరని, ఆర్‌ఐ రవికుమార్ వెంకటాచలం రాకుండానే ఎక్కడో ఉండి దొడ్డిదారిలో సంతకాలు పెట్టించుకున్నారని ఆరోపించారు.
ఈ విషయంపై ఎస్పీ సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ జరిపితే తాను చెప్పేది అవాస్తవమని తేలితే ఏ శిక్షకై నా తాను సిద్ధమని స్పష్టం చేశారు. మందల వెంకటశేషయ్య అంచెలంచెలుగా ఎదుగుతుండడంతో సోమిరెడ్డి జీర్ణించుకోలేక మహిళతో కలిసి తప్పుడు కేసు బనాయించి జైలుకు పంపాడని మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పడు కేసులు బనాయించడం సిగ్గుమాలిన చర్య అని ధ్వజమెత్తారు. వెంకటశేషయ్యపై అక్రమ అరెస్ట్ చేసి జైలుకు పంపిన వారిని ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
భయపడేది లేదు
జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేతలను జైలుకు పంపినా భయపడే ప్రసక్తే లేదని కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. అన్యాయంగా కేసులు నమోదు చేసినా, పోలీసులు సివిల్ కేసుల్లో జోక్యం చేసుకుని ఇబ్బంది పెట్టినా పోలీస్‌స్టేషన్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. జైల్ భరోకైనా తాము సిద్ధంగా ఉంటామని చెప్పారు. వెంకట శేషయ్యపై మోపిన అక్రమ కేసు పై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఆయన వెంట మండల కన్వీనర్ కొణిదెన మోహన్‌నాయుడు, నాయకులు కొణిదెన విజయభాస్కర్‌నాయుడు, చీకుర్తి నరసయ్య పాల్గొన్నారు.
అన్యాయంగా జైలుకు పంపారు: ఫిర్యాదురాలి అత్తమామలు
వెంకటాచలం: మాజీ జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్యపై మా కోడలి చేత తప్పుడు కేసు నమోదు చేయించి ఆయన్ను అన్యాయంగా జైలుకు పంపార ని వెంకటాచలం గ్రామానికి చెందిన వెంకటమ్మ, పెంచలయ్య దంపతులు చెప్పారు. మండలంలోని చెముడుగుంటలోని జిల్లా జైలు వద్ద గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. తమ కుటుంబంలో ఆర్థిక లావాదేవీల గురించి వెంకటశేషయ్యకు చెప్పుకున్నామన్నారు. మాకు ఇవ్వకుండా తప్పించుకోవడం కోసమే మా కోడలు ఆయనపై ఈ కేసు పెట్టిందని విచారం వ్యక్తం చేశారు.
సీఐ సుబ్బారావు మా ఇంటికి వచ్చినప్పుడు తాము ఆస్పత్రిలో ఉన్నామని, సీఐకు తాము డాక్యుమెంట్లు ఇచ్చినట్లు ఆర్‌ఐ రవికుమార్ దానిని ధ్రువీకరిస్తూ సంతకం పెట్టడం దుర్మార్గమని చెప్పారు. వెంకటశేషయ్యను అన్యాయంగా జైలుపాలు చేయడం కోసమే తప్పు డు డాక్యుమెంట్లు సృష్టించి దొంగ సంతకాలు పెట్టించారని ఆరోపించారు. జిల్లా అధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment