గత డీఎంహెచ్‌ఓకు కడప సీఎస్ ఆర్‌ఎంఓగా పోస్టు
● కోర్టును ఆశ్రయించడంతో
వెనక్కి తగ్గిన ప్రభుత్వం
నెల్లూరు (అర్బన్): నెల్లూరు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిగా (డీఎంహెచ్‌ఓ) పని చేసిన డాక్టర్ పెంచలయ్య బదిలీ వ్యవహారం కొలిక్కి వచ్చింది. ఇటీవల ఆయన్ను ప్రభుత్వం డిమోట్ చేసి రంపచోడవరం అడిషనల్ డీఎంహెచ్‌ఓగా బదిలీ చేసింది. డాక్టర్ పెంచలయ్యను మాజీమంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ మనిషిగా ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఆయన స్థాయిని తగ్గించి సుదూరంలోని మన్యం ప్రాంతానికి బదిలీ చేయించారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో డాక్టర్ పెంచలయ్య తాను రాష్ట్రంలోనే సీనియర్‌నని, తక్కువ క్యాడర్ ఉన్న వారికి ప్రమోషన్ ఇచ్చి డీఎంహెచ్‌ఓగా నియమించి తనకు అన్యాయం చేశారంటూ ఆయన కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు మొట్టికాయలు వేయక ముందే ప్రభుత్వం మేల్కొంది. ఆగమేఘాలపై రంపచోడవరం అడిషనల్ డీఎంహెచ్‌గా బదిలీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. కడపలో ఉన్న 300 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సీఎస్ ఆర్‌ఎంఓగా నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ పద్మావతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
వీఎస్‌యూలో
జాబ్ మేళా
వెంకటాచలం: మండలంలోని కాకుటూరులో ఉన్న విక్రమసింహపురి యూనివర్సిటీ(వీఎస్‌యూ)లో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహించారు. 47 మంది అభ్యర్థులు హాజరుకాగా, వివిధ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేసి 18 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. ఉద్యోగాలు పొందిన వారిని వీఎస్‌యూ ఇన్‌చార్జి వీసీ విజయభాస్కరరావు అభినందించారు.
ఉద్యోగాలకు 11 మంది ఎంపిక
ఉదయగిరి: స్థానిక మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన జాబ్‌మేళాలో 11 మంది నిరుద్యోగులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు నియామక పత్రాలు పొందినట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ నారాయణస్వామి తెలిపారు. 34 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరు కాగా 11 మందిని గ్రీన్‌టెక్, ఎయిల్‌టెల్ పేమెంట్ బ్యాంకు కంపెనీలు ఉద్యోగాలకు ఎంపిక చేశాయన్నారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారి అబ్దుల్‌ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు.
రెండు యూనిట్లలో విద్యుదుత్పత్తి
ముత్తుకూరు: మండలంలోని నేలటూరులో ఉన్న శ్రీదామోదరం సంజీవయ్య ఏపీజెన్‌కో ప్రాజెక్ట్‌లో రెండు యూనిట్ల నుంచి విద్యుదుత్పత్తి జరుగుతోందని ప్రాజెక్ట్ ఇంజినీర్లు శుక్రవారం తెలిపారు. 1వ యూనిట్లో 540, 3వ యూనిట్లో 560 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. ఓవర్ ఆయిలింగ్ కారణంగా 2వ యూనిట్లో ఉత్పత్తి నిలిపివేసినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment