బిల్లుల్లో గిల్లుడు
ఐసీడీఎస్ కథే వేరయా..!
కందుకూరు రూరల్: కందుకూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అవినీతికి అడ్డాగా మారింది. ప్రతి అంశంలో కమీషన్లు బొక్కేస్తూ భారీగా వెనుకేసుకుంటున్నారు. వాస్తవానికి కందుకూరు ఐసీడీఎస్ అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలోని కందుకూరు అర్బన్‌లో 60, కందుకూరు మండలంలో 51, వలేటివారిపాళెంలో 53 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజనం పెట్టేందుకు కూరగాయలు, తాళింపు గింజలు, గ్యాస్‌కు ప్రత్యేకంగా బిల్లును ప్రభుత్వం ఇస్తుంది. ముందుగా వర్కర్లు డబ్బులు ఖర్చు పెటి ప్రతి నెలా బిల్లులు పెట్టుకుంటారు. కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రతి కేంద్రంలో ప్రతి నెలా రెండు ఈవెంట్స్‌ను నిర్వహించాలి. ఒక్కో దానికి రూ.250 బిల్లొస్తుంది. వీటిలో పది శాతం కమీషన్‌ను సంబంధి ప్రాజెక్ట్ అధికారికి ముట్టజెప్పాలి. మరోవైపు కొన్ని కేంద్రాల్లో పిల్లల పేర్లు నమోదైనా, వారు రారు. ఇలాంటి కేంద్రాల కార్యకర్తలు నెలకు రూ.వెయ్యి, అరకొరగా హాజరవుతుంటే రూ.500 ప్రతి నెలా చెల్లించాలి. ఇలా సమర్పిస్తే పిల్లలు వచ్చినా.. రాకపోయినా ఫుల్ హాజరు వేసుకుని బిల్లు పెట్టుకోవచ్చు.
కమీషన్ వచ్చేది ఇలా..
అక్టోబర్‌లో ఇచ్చిన కూరగాయల, తాళింపులు, గ్యాస్ బిల్లు రూ.57,080 కాగా, 10 శాతం లెక్కన రూ.5,708, ఈవెంట్స్ బిల్లు రూ.82 వేలు కాగా రూ.8,200, అద్దెల బిల్లు రూ.2.5 లక్షలు కాగా, రూ.25 వేలు, ఇలా ఒక్కో నెల సంబంధిత ప్రాజెక్ట్ అధికారిణికి కమీషన్ రూపంలో అక్షరాల రూ.38,908 ఇవ్వాల్సిందే. ఇక పిల్లల్లేని సెంటర్లు, ఇతర ఖర్చుల వసూళ్లు చూస్తే నెలకు దాదాపు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ముట్టజెప్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా కార్యకర్తలు, ఆయాల నుంచి వసూలు చేసినట్లు సమాచారం కందుకూరు అర్బన్, వలేటివారిపాళెం సెంటర్ల నుంచి రూ.500, ఒక్క కందుకూరు మండలంలోని వారి నుంచి రూ.1,500 వంతున మొత్తం రూ.1.33 లక్షలు వసూలు చేశారని కార్యకర్తలు వాపోతున్నారు. ప్రత్యేకంగా సెక్టార్ మీటింగ్‌లు పెట్టి మరీ వసూళ్ల పర్వానికి తెరలేపారు.
కుచ్చుటోపీ
ప్రాజెక్ట్ పరిధిలోని 164 అంగన్‌వాడీ కేంద్రాలకు 75 కేంద్రాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. వీటికి కొలత ప్రకారం అద్దెను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇంజినీర్ల స్టేట్‌మెంట్‌నూ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అంగన్‌వాడీ కార్యకర్తలు మాత్రం కొలతల మేరకు కాకుండా యజమానితో ప్రత్యేకంగా అద్దె మాట్లాడుకుంటారు. కొలతల ప్రకారం ఐసీడీఎస్ కార్యాలయంలో నకిలీ అగ్రిమెంట్లను అందజేశారు. అద్దెను జమ చేసేందుకు భవన యజమాని బ్యాంక్ ఖాతా నంబర్‌ను ఇవ్వాల్సి ఉంది. అయితే అలా కాకుండా కార్యకర్తలకు అనుకూలమైన వారి ఖాతా నంబర్‌ను ఐసీడీఎస్ కార్యాలయంలో అందజేస్తారు. ఆ ఖాతాలోనే బిల్లులు జమవుతున్నాయి. దాదాపు అద్దె భవనాల యజమానుల పేర్లన్నీ మహిళలవే ఉంటున్నాయి. దీని బట్టి అంగన్‌వాడీ వర్కర్లు తమకు అనుకూలమైన మహిళల ఖాతాలనే ఇస్తున్నారని తెలుస్తోంది. సుమారు రూ.ఐదు వేల అద్దె ఐసీడీఎస్ నుంచి వస్తే యజమానికి వారు మాట్లాడుకున్న మేరకు రూ.మూడు వేల నుంచి రూ.3,500 ఇచ్చి మిగిలిన సొమ్మును కార్యకర్తలు, సూపర్‌వైజర్లు పంచుకుంటున్నారు.
ఇదో ఉదాహరణ..
కందుకూరు అర్బన్‌లోని వడ్డెపాళెం అంగన్‌వాడీ కేంద్ర అద్దెకు కమ్మపాళెం అంగన్‌వాడీ కార్యకర్త భర్త పేరు.. కమ్మపాళెం కేంద్రానికి టీచర్ కొడుకు పేరు.. కృష్ణానగర్ కాలనీలోని కేంద్రానికి టీచర్ కుమారుడు పేర్లను ఇచ్చారు. సింహాద్రినగర్ కాలనీ కేంద్రానికి ప్రభుత్వం రూ.4,700 చెల్లిస్తుండగా, అ భవనానికి అద్దె రూ.మూడు వేలే ఉంది. కోటకట్టవీధిలోని 13వ నంబర్ కేంద్రానికి రూ.4,500 ఇస్తున్నా.. అక్కడ అద్దె రూ.3,500 మాత్రమే ఉంది. ఇలా ప్రతి అద్దె భవనాల్లోని కేంద్రాల్లో నకిలీ అగ్రిమెంట్లు సృష్టించి మిగిలించుకుని పంచుకుంటున్నారు.
అసిస్టెంట్ సీడీపీఓగా చెలామణి
ఐసీడీస్ అధికారిణి కుడి భుజంగా ప్రాజెక్ట్‌లోని ఓ కార్యకర్తను ఏర్పాటు చేసుకున్నారు. బిల్లులు వచ్చాయంటే వెంటనే సదరు కార్యకర్త ఎంత కమీషన్ రావాలనే విషయమై సెంటర్ల వారీగా పేపర్‌పై రాసి వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నారు. మేడం చెప్పారు.. కమీషన్ డబ్బులు తెచ్చివ్వండి.. లేదా ఫోన్ పే కొట్టండంటూ వాయిస్ మేసేజ్‌లు పెడుతున్నారు. ఇలా వసూలైన మొత్తాన్ని సెక్టార్ మీటింగ్‌లో సీడీపీఓకు అప్పగిస్తారు. ఇలా సెక్టార్‌కో కార్యకర్తను ఏర్పాటు చేసుకొని వసూలు చేయిస్తున్నారు. అక్టోబర్, నవంబర్‌కు సంబంధించిన బిల్లుల కమీషన్‌ను గత నెల్లో నిర్వహించిన సెక్టార్ మీటింగ్‌కు వచ్చి సీడీపీఓ తీసుకెళ్లారు. ఈ కమీషన్‌ను ట్రెజరీ అధికారులకు ఇవ్వాలంటూ అబద్ధాలు చెబున్నారు.
కార్యాలయం వైపు కన్నెత్తి చూడరు
కందుకూరు సీడీపీఓగా ఉంటూ నెల్లూరులోని సర్వీస్ హోమ్ (ఎఫ్‌ఏసీ)పై పనిచేస్తున్నారు. వారంలో మూ డు రోజులు ఇక్కడ, మూడు రోజులు అక్కడ విధులు నిర్వర్తించాల్సి ఉంది. అయితే సీడీపీఓ మాత్రం నెల్లూరులోనే ఉంటూ కార్యాలయానికి రావడం లేదు. ఏమైనా ఫైళ్లపై సంతకాలు కావాలంటే కార్యాలయ సిబ్బందినే నెల్లూరు పిలిపించుకుంటున్నారు. ఏదో రోజు వచ్చి రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్తారు. ఆమె పనితీరుపై పలు విమర్శలొస్తున్నాయి. కాగా ఈ అంశమై ఐసీడీఎస్ పీడీ సుశీలాదేవిని సంప్రదించగా, అవినీతికి పాల్పడితే చర్యలు చేపడతామని చెప్పారు. పీడీగా నూతనంగా వచ్చానని, త్వరలో ప్రాజెక్ట్‌లను పరిశీలిస్తామని బదులిచ్చారు.
ప్రతి అంశంలో పది శాతం కమీషన్ ఫిక్స్
పిల్లల్లేని కేంద్రాలకు రూ.వెయ్యిస్తే అంతా ఓకే
అద్దె భవనాల యాజమానులకు కుచ్చుటోపీ
ఈ సొమ్మంతా అధికారిణి బ్యాగులోకి
ఐసీడీఎస్ శాఖాధికారుల అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. పేద కుటుంబాల్లోని చిన్నారుల నుంచి గర్భిణులు, బాలింతల సంరక్షణ, సమగ్ర వికాసానికి దోహదపడాల్సిన ఆ శాఖలోని అధికారులు కంచే చేను మేసిన చందంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రతి అంశంలో కమీషన్లు దండుకోవడంతో కింది స్థాయిలో పనిచేసే అంగన్‌వాడీ వర్కర్లు అడ్డదారులు తొక్కాల్సిన తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. సీడీపీఓ, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు ఇలా ఎవరి స్థాయిలో వారు అవినీతికి పాల్పడుతున్నారు. కందుకూరు అర్బన్ ప్రాజెక్ట్‌లో జరుగుతున్న అవినీతి అక్రమాల తీరును పరిశీలిస్తే విస్మయం తలెత్తక మానదు.
Comments
Please login to add a commentAdd a comment