విద్యార్థులను మోసగించిన కూటమి ప్రభుత్వం
● ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన
నెల్లూరు (టౌన్): అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని వాగ్దానం చేసి, అమలు చేయకుండా సీఎం చంద్రబాబు మోసం చేశారని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్ షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక వీఆర్సీ సెంటరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ముందు ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ నాన్నకు ఇచ్చే ఇంధనం మీద ఉన్న శ్రద్ధ.. తల్లికి ఇచ్చే వందనం మీద లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని మంత్రి లోకేశ్ గాలికి వదిలివేశారని మండిపడ్డారు. కేబినెట్ మీటింగ్‌లో విద్యారంగానికి పెద్దపీట వేస్తారని తల్లిదండ్రులు, విద్యార్థులు ఎదురు చూశారని, చివరికి నిరాశే మిగిలిందన్నారు. అధికారంలోకి రావడానికి ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తరువాత హామీలు అమలు చేయలేమంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే తల్లికి వందనం అమలు చేయాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పవన్‌కిశోర్, నాయకులు శివమ్‌వర్మ, హనీష్, అబ్దుల్, జీవన్, సుధీర్, సోహెల్, శరన్, మౌళి, సాయి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment