దేహదారుఢ్యపరీక్షలకు 205 మంది హాజరు
నెల్లూరు(క్రైమ్): పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా పోలీసు కవాతు మైదానంలో జరుగుతున్న దేహదారుఢ్య పరీక్షలు శనివారం ఐదో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 5 గంటల నుంచే మహిళా అభ్యర్థులు 205 మంది కవాతు మైదానానికి చేరుకున్నారు. ఎస్పీ జి.కృష్ణకాంత్ పర్యవేక్షణలో పోలీసు అధికారులు తొలుత అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి, ఎత్తు, ఛాతి కొలతల పరీక్షలు నిర్వహించారు. వాటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు పరుగుపందెం, లాంగ్‌జంప్ విభాగాల్లో పరీక్షలు నిర్వహించారు.
వన్‌మ్యాన్ కమిషన్‌కు
వినతులు వెల్లువ
● ఎస్సీ కులాల ఉపవర్గీకరణపై
363 వినతులు
నెల్లూరురూరల్: ఎస్సీ కులాల ఉపవర్గీకరణకు సంబంధించి విజ్ఞప్తులు స్వీకరించేందుకు నెల్లూరుకు వచ్చిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు ఎస్సీ ప్రజలు, కులసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో అర్జీలు అందజేశారు. శనివారం ఉదయం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ఎస్సీ కులాల ఉపవర్గీకరణపై కలెక్టర్ ఆనంద్‌తో కలిసి అధికారులతో కమిషన్ చైర్మన్ సమావేశం నిర్వహించారు. ఎస్సీల స్థితిగతులు రిజర్వేషన్ ఫలాలు ఎంత మేరకు అందాయనేది తెలపాలని కోరారు. అనంతరం ఎస్సీ ప్రజలు, సంఘాల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. పలువురు కుల సంఘాల నేతలు తమ అభిప్రాయాలను కమిషన్ చైర్మన్ ఎదుట వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకమని, వెనుకబాటు తనానికి అది పరిష్కారం చూపదని కొందరు అభిప్రాయ వ్యక్తం చేశారు. ఎస్సీలు ఐక్యంగా ఉండాలని, కులగణన పక్కగా చేపట్టాలని పలువురు కోరారు. ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగాల్లో రిజిర్వేషన్ కల్పించాలని, క్రిమిలేయర్ సమ్మతం కాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ కార్తీక్, ఏఎస్పీ సౌజన్య, డీఆర్‌ఓ ఉదయ్‌భాస్కర్, కమిషన్ జిల్లా పర్యటన లైజింగ్ అధికారి, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి పాల్గొన్నారు.
సంక్రాంతికి
183 స్పెషల్ బస్సులు
నెల్లూరు సిటీ: ఇతర రాష్ట్రాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ సొంత జిల్లాలకు వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం నెల్లూరు జిల్లాకు ఏపీఎస్ ఆర్టీసీ 183 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం మురళీబాబు శనివారం ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు 121 బస్సులు, బెంగళూరు నుంచి 42, చైన్నె నుంచి 20 స్పెషల్ బస్సులు నడుపుతున్నామన్నారు. ఆయా బస్సుల్లో ప్రయాణించే వారికి సాధారణ చార్జీలు మాత్రమే వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కూడా స్పెషల్ బస్సుల్లో కల్పించినట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment