తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు
● వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత లెక్కలు సరిచేస్తాం
● నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టినా
అక్కడి నుంచే పోటీ చేస్తా
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు(బారకాసు): వెంకటాచలం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వెంకటశేషయ్య యాదవ్‌పై శ్రావణి అనే మహిళ నుంచి తప్పుడు ఫిర్యాదు చేయించి పోలీసులు కేసు నమోదు చేసి.. అందుకు అవసరమైన తప్పుడు సాక్ష్యాలు సృష్టించారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. శనివారం నెల్లూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతోందని విమర్శించారు. వెంకటశేషయ్య అరెస్టుకు సంబంధించి పూర్తి ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. పోలీసులే నేరగాళ్లుగా మారి తప్పుడు కేసు బనాయించారనేందుకు సాక్ష్యాధారాలతో సహా ప్రజలకు తెలియజేసేందుకు మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వెంకటాచలం సీఐ సుబ్బారావు, రెవెన్యూ ఆర్‌ఐ వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. జిల్లా ఎస్పీ కూడా తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వెంకటశేషయ్యను నెల్లూరు రూరల్ స్టేషన్‌లో ఉంచి, వెంకటాచలం సీఐ సుబ్బారావు 2024 డిసెంబరు 24వ తేదీ ఉదయం వెంకటాచలంలోని శ్రావణి అత్తమామల ఇంటికి తీసుకొని వెళ్లి శ్రావణి మామ పెంచలయ్య రెండు రూ.50 విలువ కలిగిన శ్రావణి సంతకంతో కూడిన రెండు ఖాళీ స్టాంప్ పేపర్లు తనకు అందించాడని తప్పుడు స్వాధీన మహాజరునామా తయారు చేసి, ఆర్‌ఐ రవికుమార్ అక్కడికి రాకుండానే వచ్చినట్లుగా సంతకం చేసి, మోసపూరితంగా తయారు చేసిన మహాజరునామాను కోర్టుకు సమర్పించారని వివరించారు. సీఐ, ఆర్‌ఐలు ఇద్దరు కలసి వెంకటశేషయ్యపై కుట్రపన్ని తప్పుడు కేసు నమోదు చేశారనడానికి ఆధారాలు ఇవేనంటూ మీడియా ఎదుట చూపించారు. ఆ డాక్యుమెంట్ నంబర్లు ఏఎల్ 860784, ఏఎల్ 860785 వీటిని ఎవరికి, ఎప్పుడు ఇచ్చారని కోవూరు సబ్‌రిజిస్ట్రార్‌ను ఆర్టీఏ యాక్ట్ కింద అడగగా.. సదరు డాక్యుమెంట్లు 2022 నవంబరు 15 నాటివి కాదని వాటిని స్టాంప్ వెండర్ లోక్‌నాథ్‌సింగ్ 2024 జూలై 31న కోవూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కొనుగోలు చేసి, 2024 డిసెంబరు 23న శ్రావణి భర్త పెంచలయ్యకు విక్రయించినట్లుగా లిఖిత పూర్వకంగా ధ్రువీకరించారన్నారు. శేషయ్యపై సోమిరెడ్డి చెప్పినట్లుగా దొంగ కేసు బనాయించడానికి వెంకటాచలం సీఐ సుబ్బారావు 2024 డిసెంబరు 23న స్టాంప్ పేపన్లు కొనుగోలు చేసి, ఆ స్టాంప్ పేపర్లపై 2022 నవంబరు 11వ తేదీ వేసి అక్రమంగా, అన్యాయంగా, యాదవ సామాజిక వర్గానికి చెందిన శేషయ్యపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారన్నారు. కేసుకు సంబంధించిన ఎంకై ్వరీ చేసే సమయంలో శ్రావణి అత్తమామ ఉన్నట్లుగా నివేదికల్లో పొందుపరిచారు. వాస్తవంగా ఆ సమయంలో వారిద్దరూ లేరన్నారు. తప్పుడు స్టాంప్ పేపర్లు సృష్టించి, కోర్టును తప్పుదోవ పట్టించిన వారందరూ శాశ్వతంగా ఉద్యోగాలు కోల్పోవడంతో పాటు, జైలుకు వెళ్లడం ఖాయమని కాకాణి చెప్పారు. తనపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడనని 2029 వరకు తనను అరెస్టు చేసి జైల్లో పెట్టినా అక్కడి నుంచి ఎన్నికలలో పోటీ చేస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment