మరణంలోనూ ఒక్కటయ్యారు
సంగం: వ్యవసాయ పనులు చేస్తూ, కూరగాయలు అమ్ముకుంటూ ఆ భార్యాభర్తలు కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఊరూరు తిరిగి కూరగాయలు అమ్ముకునేందుకు ఆటోలో బయలుదేరారు. కొద్ది సేపటికే వీరి ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో భర్త అక్కడికక్కడే దుర్మరణం చెందగా, భార్య కొనఊపిరితో నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువు ఒడికి చేరింది. బడికి వెళ్లమని ముగ్గురు బిడ్డలకు జాగ్రత్తలు చెప్పి బయలుదేరిన తల్లిదండ్రులు.. అంతలోనే విగతజీవులై రావడంతో బిడ్డలు గుండెలవిసేలా రోదించారు. అందరితో కలివిడిగా ఉండే ఆ దంపతులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడడంతో అనసూయనగర్ విషాదంలో మునిగిపోయింది.
ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ హైర్ బస్సు
సంగం మండలం సిద్ధీపురం పంచాయతీ మజారా అనుసూయనగర్‌కు చెందిన నెల్లూరు వెంకటశేషయ్య (42), నెల్లూరు వరలక్ష్మి (36) దంపతులు. వీరికి ముగ్గురు బిడ్డలు. వెంకటశేషయ్య వ్యవసాయ పనులు చేస్తుంటే, వరలక్ష్మి గంపలో కూరగాయలు తీసుకుని సమీప గ్రామాల్లో విక్రయిస్తుండేది. కూరగాయల వ్యాపారం లాభసాటిగా ఉండడంతో దంపతులు తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఇటీవల ఆటో తీసుకుని అందులో కూరగాయలు తీసుకుని మండలంలోని గ్రామాల్లో తిరుగుతూ అమ్మకాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వెంకటశేషయ్య, వరలక్ష్మి శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆటోలో కూరగాయలు తీసుకుని మొదట వెంగారెడ్డిపాళెంలో అమ్ముకుని అక్కడి నుంచి నెల్లూరు – ముంబయి జాతీయ రహదారిపైకి వచ్చి సంగం వైపు బయలుదేరారు. అదే సమయంలో ఆత్మకూరు డిపోకు చెందిన పల్లెవెలుగు హైర్ బస్సు ఉదయాన్నే ఆత్మకూరు నుంచి నెల్లూరు బయలుదేరింది. ఉదయం 6 గంటల సమయంలో పొగమంచు కురుస్తుండడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి. ఆర్టీసీ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యంగా తన ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టారు. దీంతో ఆటో ముందు భాగం నుజ్జనుజ్జు కావడంతో వెంకటశేషయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో వెనుక ఉన్న వరలక్ష్మి తీవ్రంగా గాయపడడంతో 108 వాహనంలో నెల్లూరు వైద్యశాలకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వరలక్ష్మి సైతం మృతి చెందింది. ప్రమాద విషయం తెలుసుకున్న సంగం ఎస్సై రాజేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనాథలైన ముగ్గురు పిల్లలు
ఈ ప్రమాదంలో మృతి చెందిన దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు శివ దువ్వూరు పాఠశాలలో 8వ తరగతి చదువుతుండగా, చిన్నకుమారుడు, కుమార్తె బాలాజీ, ప్రవళ్లిక 4, 2 తరగతులు చదువుతున్నారు. తల్లిదండ్రుల మృతితో చిన్నారులు అనాథలయ్యారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎంవీఐ
ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగి దంపతులు మృతి చెందిన విషయం తెలుసుకుని సంగంలో ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రాములు పరిశీలించారు. బస్సు కండీషన్ తనిఖీ చేశారు. ఆత్మకూరు డిపో మేనేజర్ కరిమున్నీసాతో ప్రమాద విషయాలపై చర్చించారు.
బస్సు ఢీకొనడంతో ఆటోలోనే
మృతి చెందిన వెంకటశేషయ్య
వెంకటశేషయ్య, వరలక్ష్మి వివాహంతో ఒక్కటి కాగా.. అర్ధాంతర మరణంలోనూ ఒక్కటయ్యారని అనసూయనగర్ వాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దంపతులిద్దరు అన్యోన్యంగా ఉండడమే కాకుండా.. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండేవారు. అలాంటి వారు ప్రమాదంలో మృతి చెందడంపై గ్రామం మొత్తం కన్నీటి పర్యంతమైంది. తల్లిదండ్రుల మరణంతో అనాథలైన ఆ పిల్లల పరిస్థితి ఏమిటని గ్రామస్తులు తల్లిడిల్లిపోతున్నారు. తల్లిదండ్రులకు ఏం జరిగిందో తెలియక.. అమ్మ, నాన్నకు ఏమైందంటూ ఆ బిడ్డలు అడుగుతుంటే.. ఏం చెప్పాలో తెలియక గ్రామస్తులు, బంధువులు, కన్నీరు పెట్టుకుంటున్నారు. పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు వేగంగా ప్రయాణించడం, వాహనాలను ఓవర్ టేక్ చేయొద్దని రవాణాశాఖ హెచ్చరిస్తున్నప్పటికీ ఆర్టీసీ డ్రైవర్ అతివేగంతో పాటు ముందు ఉన్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని అక్కడి వారు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment