నెల్లూరు ఆతిథ్యం తెలియజేస్తాం
చరిత్రాత్మక నగరం సింహపురి. జాతీయ స్థాయి క్యారమ్స్ పోటీలకు సిద్ధమైంది. ప్రతిష్టాత్మకమైన నెల్లూరు క్లబ్ ఇందుకు వేదిక అయింది. దేశ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన సంస్థల జట్లతోపాటు, మహామహులైన క్రీడా జట్లు, అంతర్జాతీయ క్యారమ్స్ ఫెడరేషన్ ప్రతినిధులు హాజరు కానున్నారు. తొలిసారిగా నెల్లూరులో జరిగే ఈ పోటీలను నెల్లూరు క్లబ్ ఆర్గనైజర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేశారు.
జాతీయ స్థాయి పోటీలను నిర్వహించడమే గర్వకారణం. నెల్లూరీయుల ఆతిథ్యాన్ని జాతీయ స్థాయిలో తెలియజేస్తాం. క్రీడా వసతి, నిర్వహణలో ప్రతి అంశాన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నెల్లూరు పేరును జాతీయ స్థాయిలో చిరస్థాయి చేస్తాం. ఇప్పటికే నెల్లూరు క్లబ్‌లో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం.
– సీహెచ్ శ్రీమన్నారాయణ,
అధ్యక్షుడు, జిల్లా క్యారమ్
అసోసియేషన్
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ఆంధ్ర రాష్ట్ర క్యారమ్ అసోసియేషన్, నెల్లూరు జిల్లా క్యారమ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 29వ ఆలిండియా ఫెడరేషన్ కప్ టోర్నమెంట్–2025 పోటీలు ఆదివారం నుంచి జరగనున్నాయి. నెల్లూరులో ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు నెల్లూరు క్లబ్ ఈ జాతీయ స్థాయి క్రీడా పండుగలకు వేదిక కానుంది. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారుల రాకతో నెల్లూరు క్లబ్ కళకళలాడుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు, అంతర్జాతీయ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. వీరితో పాటు క్రీడలను ప్రోత్సహించే 10 సంస్థల జట్లు హాజరవుతున్నాయి. ఒక్కొక్క రాష్ట్ర జట్టులో నలుగురు పురుషులు, నలుగురు మహిళలు పాల్గొంటున్నారు. సంబంధిత మేనేజర్లు, కోచ్‌లు, టెక్నికల్ సిబ్బందితోపాటు 400 మంది ఈ టోర్నీ కోసం నెల్లూరుకు వస్తున్నారు. టోర్నీ ప్రతిష్టను పెంచే విధంగా తెలంగాణకు చెందిన టాప్ సీడెడ్‌లు కె.శ్రీనివాస్, రష్మీకుమారి, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ శ్రీనివాస్, తమిళనాడుకు చెందిన ఖాజీమాతోపాటు దేశానికి చెందిన ప్రసిద్ధ సంస్థలు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, బీఎస్‌ఎన్‌ఎల్, కాగ్, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ బోర్డు, ఎల్‌ఐసీ, ఆర్బీఐ తదితర సంస్థల జట్లతోపాటు ప్రభుత్వ సంస్థల టాప్ సీడెడ్ క్రీడాకారులు పోటీల్లో తలపడనున్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులతో పోటీ పడడంతో వర్థమాన క్రీడాకారుల క్రీడానైపుణ్యం మెరుగు పరచుకునేందుకు నెల్లూరు వేదిక కానుంది. ఈ పోటీలను ్గూఖీౖ. ఇఅఖఖౖక. ఐూ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు.
ఏర్పాట్లు సర్వం సిద్ధం
ఆదివారం ఉదయం 10 గంటలకు నెల్లూరు క్లబ్‌లో ఆలిండియా ఫెడరేషన్ క్యారమ్ టోర్నమెంట్ 2024–2025 పోటీలను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు. అంతర్జాతీయ క్యారమ్ ఫెడరేషన్ అధ్యక్షుడు (స్విట్జర్లాండ్) జోసెఫ్ మేయర్‌తోపాటు స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఇంటర్నేషనల్ క్యారమ్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ వీడీ నారాయణ్, ఆలిండియా క్యారమ్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ భారతీనారాయణ్, ఆంధ్రప్రదేశ్ క్యారమ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్కే అబ్దుల్ జలీల్, టోర్నీ కో చైర్మన్ మలిరెడ్డి కోటారెడ్డి, అసోసియేషన్ జిల్లా సెక్రటరీ వీఆర్ శ్రీధర్ పర్యవేక్షకులుగా వ్యవహరిస్తున్నారు.
సింహపురికే ప్రతిష్టాత్మకం
ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి పోటీలు నెల్లూరు క్లబ్‌లో నిర్వహించనుండడం చారిత్రాత్మకం. క్రీడలకు సంబంధించిన ప్రతి అంశాన్ని నెల్లూరు క్లబ్ సభ్యులు, సంబంధిత టోర్నీ నిర్వాహకులు జాగ్రత్తగా నిర్వహిస్తారు. ఈ టోర్నీ కోసం రెండు ఫ్లోర్‌ల నిర్మాణాలను అనుకున్న సమయానికి పూర్తి చేయగలిగాం. క్రీడలను ప్రోత్సహించడంలో నెల్లూరు క్లబ్ పూర్తి సహాయ సహకారాలను అందిస్తుంది.
– పొన్నవోలు సుధాకర్‌రెడ్డి,
కార్యదర్శి, నెల్లూరు క్లబ్,
టోర్నీ నిర్వాహక కార్యదర్శి
నేటి నుంచి ఆలిండియా ఫెడరేషన్ కప్ టోర్నమెంట్
నెల్లూరు క్లబ్ వేదికగా
నాలుగు రోజులు నిర్వహణ
అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుల రాక
Comments
Please login to add a commentAdd a comment