500 బస్తాల బియ్యం స్వాధీనం
దగదర్తి(కావలి): దగదర్తి మండలం అల్లూరు రోడ్డు సమీపంలో ఎటువంటి రికార్డులు లేకుండా తరలిస్తున్న సుమారు 500 బస్తాల బియ్యాన్ని పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై జంపాని కుమార్ తనిఖీల్లో భాగంగా బియ్యం తరలిస్తున్న లారీని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బియ్యానికి సంబంధించి ఎటువంటి రికార్డులు లేకపోవడం, రేషన్ బియ్యంగా అనుమానాలు వ్యక్తమవడంతో లారీని, బియ్యం బస్తాలను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో బియ్యం లారీని సీజ్ చేసినా సాయంత్రం వరకూ కూడా రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు పరిశీలించినట్లు ఎటువంటి సమాచారం లభించలేదు. మరో వైపు కందుకూరుకు చెందిన ఓ కీలక నేతకు చెందిన బియ్యంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి నెల్లూరు మీదుగా చైన్నెకు తరలిస్తున్న రేషన్ బియ్యంగా మెసేజ్‌లు చక్కర్లు కొట్టాయి. అధికారులు మాత్రం పూర్తి గోప్యత పాటిస్తున్నారు.
రేపు యువ ఉత్సవ్ పోటీలు
నెల్లూరు(అర్బన్): నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 8న బుధవారం నగరంలోని పురమందిరం (టౌన్‌హాలు)లో యువ ఉత్సవ్ పోటీలు నిర్వహిస్తున్నామని జిల్లా యువజన అధికారి ఎ.మహేంద్రరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. యువతీ, యువకులకు వక్తృ త్వ, సైన్సు ఎగ్జిబిషన్, వ్యాసరచన, మొబైల్ ఫొటోగ్రఫీ, డ్రాయింగ్ తదితర పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామన్నారు. ఆసక్తి కలిగిన 15 నుంచి 29 సంవత్సరాల లోపు యువత ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆరోజు ఉదయం 9 గంటలకు పురమందిరం వద్దకు చేరుకుని తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 99635 33440 నంబర్లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment