ఉపాధి పనులపై దృష్టి పెట్టండి
● సకాలంలో లక్ష్యాలు పూర్తిచేయండి
● వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఆనంద్
నెల్లూరు రూరల్: లక్ష పనిదినాలు లక్ష్యంగా ఉపాధిహామీ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ హాల్‌లో ఉపాధిహామీ, ఆర్‌డబ్ల్యుయెస్, హౌసింగ్, పంచాయతీరాజ్, సీసీ రోడ్ల గ్రౌండింగ్, ఎంఎస్‌ఎంఈ సర్వే, ఎస్టీలకు ఆధార్ కార్డుల జారీ, పీఎం సూర్యఘర్ యోజన అమలు మొదలైన అంశాలపై సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధిహామీ కింద సీసీరోడ్లు, క్యాటిల్ షెడ్ల నిర్మాణ పనులను ముమ్మరంగా చేపట్టాలన్నారు. హౌసింగ్ అధికారులు ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీ రోడ్లను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని, అలాగే సిమెంటు రోడ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినా కూడా ఇంకా మొదలుపెట్టని అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. వీసీలో జాయింట్ కలెక్టర్ కె కార్తీక్, డీఆర్‌ఓ ఉదయభాస్కర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ మోహన్‌రావు, హౌసింగ్, డ్వామా, డీఆర్‌డీఏ పీడీలు డీఈఓ బాలాజీరావు, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment