కాలువలో స్కూల్ బస్సు బోల్తా
బుచ్చిరెడ్డిపాళెం: బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని సాల్మాన్‌పురం – మినగల్లు రోడ్డులో సోమవారం ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు కాలువలో పడింది. అందులోని 25 మంది విద్యార్థులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్లోని దొడ్ల డెయిరీ పక్కనే గల శ్రీనికేతన్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌కు ప్రతి రోజూ సమీపంలోని జొన్నవాడ, మినగల్లు, పంచేడు, సాల్మాన్‌పురం గ్రామాల్లోని పిల్లలు బస్సులో వెళ్తుంటారు. సోమవారం ఉదయం కూడా బస్సు మినగల్లు నుంచి సాల్మాన్‌పురం వస్తున్న సమయంలో రోడ్లు గతుకులుగా ఉండటంతో బ్రేక్ ఫెయిలై పక్కనే ఉన్న పారుదల కాలువలోకి బోల్తా పడింది. దీంతో విద్యార్థులు గట్టిగా కేకలు వేయడంతోపాటు ఏడ్చేశారు. అప్రమత్తమైన బస్సులోని డ్రైవర్, క్లీనర్‌లతోపాటు పొలం పనులు కోసం వచ్చిన స్థానికులు కూడా సహాయం చేసి విద్యార్థులను వెలుపలికి తీశారు. క్రాంతి సందేష్ అనే విద్యార్థికి మాత్రం బలమైన గాయమైంది. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
గతుకుల రోడ్డే కారణమా?
ఆ రోడ్డు గతుకులమయం కావడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. రోడ్డు స్థలాన్ని ఆక్రమించి పంట కాలువను ఏర్పాటు చేయడం వల్ల తరచూ ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. ప్రమాద విషయం తెలిసి తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే మండల విద్యాశాఖాధికారి వెంకటరత్నం విచ్చేసి గాయపడిన విద్యార్థులను వైద్యశాలకు తరలించారు. మిగిలిన వారిని వారి తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లారు. మొత్తం మీద ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
అందులో 25 మంది విద్యార్థులు
వెంటనే బయటకు తీసిన స్థానికులు
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment