● జనరల్ మెడిసిన్, ఆర్ధోపెడిక్
విభాగాలు ఖాళీ
నెల్లూరు(అర్బన్): దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికి, వీల్‌ఛైర్‌కు పరిమితమై (బెడ్‌రిడన్) ప్రభుత్వ పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులను తేల్చేందుకు కూటమి ప్రభుత్వం వెరిఫికేషన్ ప్రారంభించింది. అనర్హుల పేరుతో అర్హులను కూడా తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. బెడ్‌రిడన్ పేరుతో సర్టిఫికెట్‌లు పొంది పింఛన్ పొందుతున్న వారిని ఇంటింటికి వెళ్లి పరిశీలించేందుకు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు 24 టీములను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా నెల్లూరు ప్రభుత్వ పెద్దాస్పత్రి, సామాజిక ఆరోగ్యకేంద్రాల నుంచి 7 టీములను తిరుపతి, చిత్తూరు జిల్లాలకు పంపాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు శనివారం పెద్దాస్పత్రికి చేరాయి. పెద్దాస్పత్రిలోని జనరల్ మెడిసిన్ విభాగం నుంచి 11 మంది డాక్టర్లను, ఆర్థోపెడిక్ విభాగం నుంచి 7 మంది డాక్టర్లను, సామాజిక ఆరోగ్య కేంద్రాల నుంచి 6 మంది డాక్టర్లను తిరుపతి, చిత్తూరు జిల్లాలకు పంపుతున్నారు. నెల రోజులపాటు డాక్టర్లు ఈ వెరిఫికేషన్ సర్వేలో పాల్గొననున్నారు. దీంతో పెద్దాస్పత్రిలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ విభాగాలు దాదాపు ఖాళీ కానున్నాయి. ఫలితంగా రోగులకు వైద్య సేవలందక తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. ఒకే దఫా ఇంత మంది డాక్టర్లను పక్క జిల్లాలకు పంపితే ఇక్కడ వైద్యసేవలు ఎలా అందించాలని డాక్టర్లు ఆవేదన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు దీర్ఘకాలిక వ్యాధులతో ఇంటికే పరిమితమైన వారికి రూ.15 వేలు పింఛన్ అందిస్తామని తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలో ఇలా బెడ్‌రిడన్‌తో ఉన్న 1274 మంది రూ.15 వేలు లెక్కన పింఛన్ పొందుతున్నారు. వీరిలో ఏదో ఒక వంక పెట్టి పలువురికి పింఛన్ కోత విధించేందుకు కూటమి ప్రభుత్వం పూనుకోవడంతో బాధితులు ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. డాక్టర్లను ఇతర జిల్లాలకు రీవెరిఫికేషన్ కోసం పంపితే ఇక్కడ రోగులకు ఎలా వైద్య సేవలందుతాయని పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్‌ను ప్రశ్నించగా ఆయన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామంటూ తలపట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment