కావలి: అనారోగ్యం, పక్షవాతం, తీవ్ర కండరాల లోపం, ప్రమాదానికి గురైన తదితర కారణాలతో మంచానికి, వీల్ చైర్‌కే పరిమితమైన వారికి గత ప్రభుత్వం ఉదారంగా నెలకు రూ.10 వేలు వంతున వైఎస్సార్ సామాజిక పింఛన్ కానుకను అందజేసింది. ఎన్నికల సమయంలో ఇటువంటి వారికి నెలకు రూ.15 వేలు ఇస్తామంటూ కూటమి నేతలు ప్రచారం చేశారు. ఆరు నెలలు ఇచ్చారో లేదో.. అప్పుడే ఈ తరహా పింఛన్ లబ్ధిదారుల్లో కోత విధించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మంచానికి, వీల్ చైర్‌కే పరిమితమైన పేదలైన ఇటువంటి విధి వంచిత అశక్తులకు 1,274 మంది గత ప్రభుత్వం హయాంలో ఇంటి వద్దనే వైఎస్సార్ సామాజిక పింఛన్ కానుకను అందుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎన్టీఆర్ భరోసా పేరుతో జూలై నుంచి రూ.15,000 చొప్పున పింఛన్లు పంపిణీ చేస్తోంది. ప్రభుత్వం నెలకు రూ.1,91,10,000 అందజేస్తోంది. ఇటువంటి లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రత్యేక బృందాలతో ప్రతి లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి పరిశీలించాలని నిర్ణయించింది. అందులో భాగంగా కలెక్టర్ డీఆర్‌డీఏ పీడీ, డీఎంహెచ్‌ఓలతో చర్చించి ప్రత్యేక బృందాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. స్థానిక పీహెచ్‌సీ, సీహెచ్‌సీ వైద్యులు, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ స్థాయి అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు ఈ నెల 6వ తేదీ నుంచి లబ్ధిదారుల నివాసాలకు వెళ్లాలని ఆదేశించారు. వారి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక అందజేయనున్నారు. లబ్ధిదారులు ఉన్న చోటు నుంచే లొకేషన్‌తో సహా వివరాలన్నీ కూడా యాప్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. ఆ తర్వాత వారు పింఛన్‌కు అర్హత ఉన్నారా? లేదా అనేది తెలియజేస్తారని సమాచారం. పింఛన్ మంజూరైనప్పుడు దరఖాస్తుతో పాటు పొందుపరిచిన వివరాల్లో ఉన్న ఇళ్లకు వచ్చిన ప్రత్యేక బృందాలకు భౌతికంగా లబ్ధిదారుడు కనిపించాలి. ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగైనా, ఈ పింఛన్ కోత విధించనున్నారు.
● జిల్లాలో 1,274 మంది లబ్ధిదారుల్లో ఏరివేతే లక్ష్యం
● ఈ నెల 6వ తేదీ నుంచి వెరిఫికేషన్‌కు ప్రత్యేక బృందాల ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment