బియ్యం సిండికేట్‌లో కుమ్ములాట
నెల్లూరు(పొగతోట): రేషన్ బియ్యం అక్రమ రవాణా కోసం ఏర్పడిన సిండికేట్‌లో విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో బియ్యం అక్రమ రవాణాపై పోలీసులకు ప్రత్యర్థి వర్గమే సమాచారమిచ్చి పట్టిస్తోంది. ఆదివారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా నగరంలోని చౌకదుకాణం నుంచి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ సిండికేట్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తే పోలీసులకు సమాచారం ఇచ్చి ఆటోను పట్టించారు. ఆటోలో 15 బస్తాలకు పైగా పీడీఎస్ (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) బియ్యం ఉన్నాయి. అంతకు ముందు రెండు ఆటోల్లో బియ్యం రైస్ మిల్లుకు తరలించినట్లు సమాచారం. దీనికి సంబంధించి చౌకదుకాణం డీలర్, ఆటోపై కేసులు నమోదు చేయాలంటూ ఆ కీలక వ్యక్తే పోలీసులపై ఒత్తిడి చేశాడు. దీంతో కేసులు లేకుండా రాజీ చేసేందుకు పౌరసరఫరాల సంస్థలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకుడు రంగ ప్రవేశం చేసినా.. కీలక వ్యక్తి రాజీకి ఒప్పుకోలేదు. కేసులు కచ్చితంగా పెట్టాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. జిల్లాలో కొన్ని సంవత్సరాలుగా బియ్యం అక్రమ రవాణా చేస్తున్న కీలక వ్యక్తి ప్రతి నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులకు నెలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ముట్టచెబుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న చౌకదుకాణాల డీలర్లందరూ రేషన్ బియ్యం అతడికే ఇచ్చేలా చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నారు. అయితే కేజీ బియ్యానికి ఇస్తున్న ధర తక్కువగా ఉండటంతో కొంతమంది డీలర్లు సిండికేట్‌ను వ్యతిరేకించి డైరెక్ట్‌గా రైస్‌మిల్లులకు రేషన్ బియ్యం తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కీలక వ్యక్తే పోలీసులకు సమాచారం ఇచ్చి దాడులు చేయించి బియ్యాన్ని పట్టిస్తున్నాడని సమాచారం. బియ్యం అక్రమ రవాణా సిండికేట్‌లో కీలక వ్యక్తి ప్రతినెలా రూ.లక్షల్లో ముడుపులు ఇస్తుండడంతో తాను చెప్పిందే జరగాలంటూ పట్టు పడుతున్నాడు. కీలక వ్యక్తికి కాకుండా ఇతరులకు బియ్యం సరఫరా చేస్తే తాను సహించలేది లేదని ఎంత వరకైనా వెళ్తానంటూ తెగేసి రాజీకి ప్రయత్నిస్తున్న ప్రజా ప్రతినిధులతో వాదనకు దిగినట్లు సమాచారం.
అక్రమ రవాణాపై పోలీసులకు లీకులు
పట్టించి.. కేసు పెట్టాలంటున్న ఒక వర్గం
వదిలేయాలని మరో వర్గం పట్టు
కేసు నమోదు చేస్తాం
ఆదివారం రాత్రి మాకు అందిన సమాచారంతో నగరంలోని చౌకదుకాణం వద్ద అక్రమ రవాణా చేసేందుకు సిద్ధంగా ఉన్న ఆటోను పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి విచారణ జరుగుతోంది. కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటాం. – అంకయ్య, ఇన్‌చార్జి డీఎస్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment