పెద్దాస్పత్రిలో హెచ్‌ఎంపీ వైరస్ వార్డు
నెల్లూరు(అర్బన్): చైనాలో ఆందోళన సృష్టిస్తోన్న హెచ్‌ఎంపీ వైరస్ ఇండియాను తాకింది. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ఈ వైరస్ పలువురికి సోకింది. రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాలతో నెల్లూరులోని ప్రభుత్వ పెద్దాస్పత్రిలో 20 పడకలతో ప్రత్యేక హెచ్‌ఎంపీ వైరస్ వార్డును మంగళవారం ఏర్పాటు చేశారు. 10 పడకలతో సాధారణ వార్డు, మరో 10 పడకలతో క్రిటికల్ వార్డును సిద్ధం చేశారు. హెచ్‌ఎంపీ వైరస్ సోకిన రోగులకు వైద్యం అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వైరస్‌కు సంబంధించిన అన్ని రకాల మందులను అత్యవసరంగా కొనుగోలు చేసేందుకు ఆర్డర్లు ఇచ్చారు. రోగులు వస్తే అందించాల్సిన సేవలపై ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర ఫార్మసీ సిబ్బంది, డాక్టర్లు, నర్సులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర మాట్లాడుతూ వైరస్ సోకిన రోగులకు ఆధునిక వైద్యం అందించేందుకు అన్ని రకాల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు మస్తాన్‌బాష, డా.గంగాధర్, అడ్మినిస్ట్రేషన్ హెచ్‌ఓడీ డాక్టర్ కళారాణి తదితరులు పాల్గొన్నారు.
20 పడకలతో ఏర్పాటు
పిల్లల కోసం 5, పెద్దలకు
మరో 5 వెంటిలేటర్లు
Comments
Please login to add a commentAdd a comment