కోడిపందేలు నిర్వహిస్తే కేసులే..
నెల్లూరు రూరల్: సంక్రాంతి పండగ నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా కోడిపందేలు నిర్వహించకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ చాంబర్‌లో పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో జంతు హింస నివారణ చట్టం అమలుపై ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్రాంతి పండగకు గ్రామాల్లో కోడి పందేలు నిర్వహించడం నేరమన్నారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. ఈ సమావేశంలో పశుసంవర్థక శాఖ జేడీ రమేష్ నాయక్, ఏఎస్పీ సౌజన్య, డీఎఫ్‌ఓ మహబూబ్‌బాషా, జెడ్పీ సీఈఓ విద్యారమ, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, ఏడి మాధవీలత తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న
దేహదారుఢ్య పరీక్షలు
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు పోలీసు కవాతు మైదానంలో ఎస్పీ జి.కృష్ణకాంత్ పర్యవేక్షణలో పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. 600 మంది అభ్యర్థులకు గానూ 462 మంది హాజరయ్యారు. వారిలో 387 మంది పరీక్షల్లో పాల్గొనగా, మిగిలిన వారు వివిధ కారణాలతో వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేహదారుఢ్య పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా పటిష్ట చర్యలు చేపట్టామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment