సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సువిశాలమైన సాగర తీరం వెంబడి ఏర్పాటవుతున్న పోర్టులు, రైల్, రోడ్డు, సీ కనెక్టివిటీ, అన్నింటికి మించి భూ సంపద, జల, మానవశక్తి వెరసి ఎన్నో రంగాల్లో అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్న జిల్లా నెల్లూరు. ఇప్పటికే ఎన్నో భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు ఉన్న జిల్లా పారిశ్రామిక రంగానికి అక్షయ పాత్ర వంటిది. కేంద్రం ప్రోత్సాహంతో వీటిని సద్వినియోగించుకుంటే జిల్లా పారిశ్రామికంగా స్వర్గధామం అవుతుందనడంలో సందేహం లేదు.
21 మంది ఎంపీలు ఉన్నా..
రాష్ట్రం నుంచి కూటమి ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వంలో 21 మంది ఎంపీల భాగస్వామ్యం ఉన్నప్పటికీ రాష్ట్రానికే కాదు.. జిల్లా ప్రాజెక్ట్‌లకు ఎలాంటి మోక్షం లభించలేదు. ఇటీవల ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నిత్యం కేంద్ర మంత్రులను కలిసి సింహపురి సమస్యలపై విన్నవించినట్లు ఆర్భాటపు ప్రచారం చేశారు. జిల్లాలో మెట్ట ప్రాంత వాసుల జీవిత కలగా నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే మార్గం మిగిలిపోతోంది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా.. అతీగతీ లేకుండా పోయింది. వెంకటాచలం మండలంలో ఏర్పాటు చేసిన ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి రెండేళ్ల క్రితమే భవన నిర్మాణానికి భూములు కేటాయించినా.. నిధుల కేటాయింపులు జరగలేదు. ఎనిమిదేశ్ల కిందట శంకుస్థాపన చేసిన భారతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ప్రాంతీయ కేంద్రం నిర్మాణం అంతే. దగదర్తి విమానాశ్రయం నిర్మాణం, బిట్రగుంటలో రైల్వే ప్రాజెక్ట్‌ల ఊసే లేదు. మధ్యలో ఆగిపోయిన రామాయపట్నం పోర్టు, పూర్తయిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పురోగతిపై ప్రస్తావనే లేదు. దివ్యాంగుల ప్రాంతీయ సంయుక్త కేంద్రం ప్రారంభమైనా.. నిధులు లేక వసతి కరువై దివ్యాంగులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కొండాపురం మండలం చింతలదేవిలో జాతీయ కామధేను పునరుత్పత్తి కేంద్రం నిధులు లేక నీరసించిపోతోంది.
క్రిస్.. ష్..
కృష్ణపట్నం వద్ద 11,095 ఎకరాల్లో రూ.5,783.84 కోట్లతో క్రిస్ సిటీ ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వం అన్ని అనుమతులు సిద్ధం చేసింది. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్‌మెంట్ లిమిటెడ్ పేరుతో టెక్స్‌టైల్స్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజినీరింగ్, ఎంఎస్‌ఎంఈ రంగాల పరిశ్రమలను ఇందులో ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధమైంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులో వస్తే 2.96 లక్షల మందికి ప్రత్యక్షంగా, 1.71 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి దక్కనుంది. అయితే ఈ ప్రాజెక్ట్ పురోగతి ఊసే లేదు.
Comments
Please login to add a commentAdd a comment