కనుల పండువగా జగన్నాథ రథయాత్ర | - | Sakshi
Sakshi News home page

కనుల పండువగా జగన్నాథ రథయాత్ర

Published Sun, Feb 2 2025 12:44 AM | Last Updated on Sun, Feb 2 2025 12:44 AM

కనుల

కనుల పండువగా జగన్నాథ రథయాత్ర

నెల్లూరు (బృందావనం): అశేష భక్తుల కోలాహలం నడుమ శనివారం సాగిన గౌర–నితాయ్‌ (జగన్నాథబలదేవ్‌) రథయాత్రతో సింహపురి భక్తిపార వశ్యంతో పులకించింది. అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్‌) నెల్లూరు శాఖ అధ్యక్షుడు డాక్టర్‌ శుకదేవస్వామి పర్యవేక్షణలో నగరంలో చేపట్టిన 12వ రథయాత్ర ఆద్యంతం వేడుకగా జరిగింది. రథయాత్ర మూలాపేట అలంకార్‌ సెంటర్‌ దగ్గర ఉన్న శ్రీహనుమాన్‌ విగ్రహం నుంచి సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమైంది. విశేషాలంకారంలో కొలువైన గౌర –నితాయ్‌, సుభద్రలకు డాక్టర్‌ శుకదేవస్వామి హారతులిచ్చారు. భక్తులు సంప్రదాయంగా గుమ్మడి కాయలతో దిష్టితీసి, కొబ్బరి కాయలు కొట్టారు. అనంతరం రథయాత్రను దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఇస్కాన్‌ మందిరాల నుంచి విచ్చేసిన నిర్వాహకులతోపాటు భక్తబృందం సంయుక్తంగా కలిసి జగన్నాధబలదేవ్‌ రథయాత్రను ప్రారంభించారు.

శ్రీకృష్ణ నామస్మరణతో సకలశుభాలు

పరమాత్ముడైన శ్రీకృష్ణ భగవానుని త్రికరణ శుద్ధిగా స్మరించడం ద్వారా సకల శుభాలు కలిగి, సమస్యలు తీరుతాయని ముంబయిలోని భక్తివేదాంత కాలేజీ ఆఫ్‌ వైదిక్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌, బీబీటీ ఇండియా ట్రస్టీ ఇస్కాన్‌ మందిరం నిర్వాహకులు ఆచార్య హెచ్‌జీ వైష్ణవాంఘ్రి సేవక్‌ దాస్‌ తెలిపారు. ఇస్కాన్‌ చేపట్టే రథయాత్ర విశిష్టతను వివరిస్తూ ఉపన్యసించారు.

భగవంతుని పట్ల ఆరాధన పెంచుకోవాలి

హోసూరు ఇస్కాన్‌ మందిరం నిర్వాహకులు హెచ్‌జీ శ్రీనివాస శ్యామ్‌ దాస్‌ మాట్లాడుతూ నేటి ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనంలో విద్య, విజ్ఞానం, ఆదాయం పెరిగాయని అయితే భగవంతుని పట్ల ఆరాధన భావం, ఆధ్యాత్మిక చింతన తగ్గిందన్నారు.

రథయాత్ర వీక్షణం మహద్భాగ్యం

నెల్లూరు ఇస్కాన్‌ మందిరం అధ్యక్షుడు డాక్టర్‌ సుఖదేవస్వామి ఉపన్యసిస్తూ జగన్నాథుడిని సేవించడం ద్వారా ఇహ పరలోక సుఖాలను పొందవచ్చన్నారు. రథంపై కొలువై ఉన్న జగన్నాథబలదేవ్‌, సుభద్రలను దర్శించుకోవడం మహద్భాగ్యమన్నారు.

ఇస్కాన్‌కు భూరి విరాళం

శ్రీకృష్ణభక్తులు, ఇస్కాన్‌ మందిరం సందర్శకులు గూడూరు రథయాత్ర నిర్వాహకులు శ్రీలక్ష్మి, మస్తాన్‌రావు దంపతులు నెల్లూరులోని ఇస్కాన్‌ మందిరానికి రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించారు. గూడూ రులోని తమకు చెందిన 132 అంకణాల స్థలాన్ని, ఇంటిని గూడూరులోని ఇస్కాన్‌ మందిరానికి దానం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఝూన్సీకి చెందిన హెచ్‌జీ కరుణసింధుదాస్‌, చీరాలకు చెందిన హెచ్‌జీ కీర్తిరాజ్‌ దాస్‌, రాష్ట్రంలోని వివిధ జిల్లాలో ఉన్న ఇస్కాన్‌ మందిరాల నిర్వాహకులు పాల్గొన్నారు.

వేడుకగా సాగిన రథయాత్ర

మూలాపేటలోని అలంకార్‌ సెంటర్‌ నుంచి ప్రారంభమైన రథయాత్ర బారకాసు, పెద్దబజారు, చిన్నబజారు, ములుమూడి బస్టాండ్‌, సంతపేట, ఏసీ బొమ్మ సెంటర్‌, గాంధీబొమ్మ, వీఆర్సీ సెంటర్‌, ఏసీ కూరగాయల మార్కెట్‌ సెంటర్‌, ఆర్టీసీ బస్‌స్టేషన్‌ కూడలి నుంచి సర్వోదయ కళాశాల మైదానానికి చేరింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ఇస్కాన్‌ మందిర స్వాములు భగవత్‌ సందేశాన్నిచ్చారు.

రథయాత్రకు సంఘీభావం

రథయాత్రకు గాంధీబొమ్మ కూడలి వద్ద మదీనావాచ్‌ కంపెనీ అధినేత షేక్‌ ఇంతియాజ్‌ సంఘీభావం తెలిపారు. ఇంతియాజ్‌ను రథయాత్ర నిర్వాహకులు జగన్నాథ బలదేవ్‌ సుభద్ర కొలువైన రథంపైకి ఆహ్వానించి అభినందలు తెలిపారు. రథయాత్ర వెంట ఆయన కొద్ది దూరం సాగారు.

భక్తజనం.. ఆధ్యాత్మిక పారవశ్యం

శ్రీకృష్ణ నామస్మరణతో పులకించిన నగరం

No comments yet. Be the first to comment!
Add a comment
కనుల పండువగా జగన్నాథ రథయాత్ర1
1/3

కనుల పండువగా జగన్నాథ రథయాత్ర

కనుల పండువగా జగన్నాథ రథయాత్ర2
2/3

కనుల పండువగా జగన్నాథ రథయాత్ర

కనుల పండువగా జగన్నాథ రథయాత్ర3
3/3

కనుల పండువగా జగన్నాథ రథయాత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement