మృతి చెందిన మహలింగ
రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం కురుగుంట సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు కర్ణాటక రాష్ట్రం హిరియూరు ప్రాంతానికి చెందినవారు. పోలీసులు తెలిపిన మేరకు... శనివారం రాత్రి తాడిపత్రి నుంచి కళ్యాణదుర్గం వైపు వెళ్తున్న బండల లారీ కురుగుంట సమీపంలో టైర్ పంక్చర్ కావడంతో రోడ్డుపైనే ఆగిపోయింది. దీనిని రోడ్డు పక్కకు తీసుకెళ్లడం కానీ, సిగ్నల్స్ వంటి భద్రతా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. కర్ణాటక ప్రాంతం హిరియూరుకు చెందిన లారీ పశువుల దాణా అనంతపురంలో అన్‌లోడ్ చేసి ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తిరుగు పయనమైంది. 2.30 గంటల సమయంలో అనంతపురం రూరల్ మండలం కురుగుంట దాటిన తర్వాత ఆగి ఉన్న బండల లారీని వేగంగా ఢీకొంది. ప్రమాదంలో హిరియూరు లారీ డ్రైవరు ప్రశాంత్ (25), కూలీలు మహలింగ (28), లింగరాజు (23) అక్కడికక్కడే చనిపోయారు. డ్రైవర్ స్నేహితుడు సుభాష్ చంద్రబోస్‌కు గాయాలయ్యాయి.
స్పందించిన
‘108’ సిబ్బంది
అటుగా వస్తున్న 108 వాహన సిబ్బంది లారీ ప్రమాద ఘటనను చూసి ఆపారు. పోలీసులకు సమాచారం అందించి గాయాలపాలైన సుభాష్ చంద్రబోస్‌ను ఆస్పత్రికి తరలించారు. అనంతపురం రూరల్ సీఐ రామకృష్ణారెడ్డి, ఇటుకలపల్లి సీఐ నరేంద్రరెడ్డి, ఎస్‌ఐలు, సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. జేసీబీ సాయంతో శ్రమించి ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం సర్వజనాస్పత్రికి తరలించారు.
అతి వేగమే కారణమా?
ఇంత పెద్ద ప్రమాదానికి లారీ అతి వేగమే కారణమని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు రోడ్డుపై ఆగి ఉన్న బండల లోడు లారీకి పార్కింగ్ సిగ్నల్స్ వేయకపోవడంతో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ గమనించక బలంగా ఢీకొందని పోలీసులు చెబుతున్నారు. టైరు పంక్చర్ కావడంతో రోడ్డుపైనే వాహనం ఆగిపోయిందని ఇలాంటి సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరం ఉందని సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. రాత్రివేళల్లో అతివేగం ప్రమాదకరమని పేర్కొన్నారు.
రాత్రిపూట టైరు పంక్చరై రోడ్డుపైనే ఆగి ఉన్న లారీకి ఎటువంటి పార్కింగ్ సిగ్నల్స్ వేయకపోవడం.. వేగంగా వచ్చిన మరో లారీ గమనించకుండా వెనుకనుంచి ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఇద్దరు కూలీలు, లారీ డ్రైవర్ దుర్మరణం చెందారు.
కురుగుంట సమీపంలో
ఘోర రోడ్డు ప్రమాదం
రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న
మరో లారీ
అక్కడికక్కడే ముగ్గురు మృత్యువాత
మృతులు కర్ణాటక ప్రాంతం
హిరియూరు వాసులు
Comments
Please login to add a commentAdd a comment