ఆరోగ్యశ్రీ పేరుతో టోకరా
చెన్నేకొత్తపల్లి: ఆరోగ్యశ్రీ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఓ మహిళను నమ్మించిన సైబర్ నేరగాడు విడతల వారీగా ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.లక్షకు పైగా నగదు మాయం చేశాడు. ఈ ఘటన చెన్నేకొత్తపల్లిలో బుధవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. చెన్నేకొత్తపల్లి మండలం ఓబులంపల్లి గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి కుమార్తె త్రిలోకపావనికి ఈనెల 2వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో ఓ కొత్త నంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేయగానే అవతలి వైపు నుంచి తాను ఆరోగ్యశ్రీ కాల్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నానని అపరిచితుడు పరిచయం చేసుకున్నాడు. అనంతరం రెండేళ్ల క్రితం మీ తండ్రి శస్త్ర చికిత్స చేయించుకున్నాడని, అందుకు సంబంధించి ప్రభుత్వం రూ.40 వేలు మంజూరు చేసిందని తెలిపాడు. అయితే బ్యాంకు ఖాతా సమస్య కారణంగా ఆ మొత్తం ఖాతాలో జమ చేయడం కుదరడం లేదని నమ్మబలికాడు. ప్రస్తుతం తాను ఖాతాను సవరిస్తున్నానని, ఇందుకోసం మీకు ఒక లింక్ పంపుతానని, దాన్ని ఓపెన్ చేయాలని సూచించాడు. అపరిచితుడి మాటలు నమ్మిన త్రిలోకపావని తన సెల్‌ఫోన్‌కు వచ్చిన లింక్‌ను ఓపెన్‌చేసింది. పిన్ ఎంటర్ చేయాలని సూచించగా, ఆ మేరకు పిన్ ఎంటర్ చేసింది. దీంతో వెంటనే ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.47 వేలు విత్‌డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో ఆందోళన చెందిన త్రిలోకపావని ఇదే విషయాన్ని అపరిచితుడికి తెలపడంతో ఆన్‌లైన్ సమస్య వల్ల అలా జరిగిందని, తాజాగా మరోసారి లింక్ పంపుతానని... దాన్ని ఓపెన్ చేస్తే ఇప్పటికే కట్ అయిన మొత్తంతో పాటు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.40 వేలు కలిపి రూ.87 వేలు బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని నమ్మబలికాడు. దీంతో త్రిలోకపావని మరోసారి తన సెల్‌కు పంపిన లింక్ ఓపెన్ చేసి ఓటీపీ ఎంటర్ చేయగానే ఖాతాలోని మరో రూ.40 వేలు విత్‌డ్రా అయింది. ఇలా మరోసారి చేయగా ఖాతాలో మిగిలి ఉన్న రూ.17,700 విత్‌డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత ఫోన్ కాల్ కట్ కాగా, మెసేజ్‌లు చదువుకున్న త్రిలోకపావని తనకు వచ్చిన నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని భావించి ఆమె వెంటనే 1903 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. 1903 కాల్ సెంటర్ నుంచి ఫిర్యాదు ఎస్పీ కార్యాలయానికి రాగా, పోలీసులు త్రిలోకపావనికి ఫోన్ చేసి స్థానిక పోలీసు స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో ఆమె మంగళవారం రాత్రి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. అపరిచిత వ్యక్తులు లింక్‌లు నొక్కమని చెప్పినా, ఓటీపీ అడిగినా చెప్పవద్దని ఎస్‌ఐ సత్యనారాయణ సూచించారు.
మహిళకు సైబర్ నేరగాళ్ల వల
లింక్ పంపి విడతల వారీగా రూ.లక్షకుపైగా స్వాహా
Comments
Please login to add a commentAdd a comment