ఉచిత పంటల బీమా కొనసాగింపు | - | Sakshi
Sakshi News home page

ఉచిత పంటల బీమా కొనసాగింపు

Published Tue, Sep 10 2024 1:42 PM | Last Updated on Tue, Sep 10 2024 1:42 PM

ఉచిత పంటల బీమా  కొనసాగింపు

వచ్చే రబీ నుంచి రైతుల నుంచి ప్రీమియం వసూలు

అనంతపురం అగ్రికల్చర్‌: ఉచిత పంటల బీమా పథకాన్ని ఈ ఖరీఫ్‌ వరకూ కొనసాగిస్తూ కూటమి సర్కారు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వచ్చే రబీ నుంచి రైతుల నుంచి ప్రీమియం వసూలు చేయనున్నారు. ఈ–క్రాప్‌ ఆధారంగా మండలం యూనిట్‌గా వాతావరణ ఆధారిత బీమా పథకం అమలవుతుందని పేర్కొన్నారు. మరిన్ని పంటలకు పంట దిగుబడి ఆధారంగా బీమా వర్తింపజేశారు.

● ప్రస్తుత ఖరీఫ్‌లో వాతావరణ బీమా పథకం కింద జిల్లాలో వేరుశనగ, పత్తి, అరటి, టమాట, చీనీ, దానిమ్మ పంటలకు వర్తిస్తుంది. రబీలో టమాటకు మాత్రమే వర్తిస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో అరటి మినహా మిగతా పంటలకు బీమా ఇచ్చారు. వర్షపాతం, ఉష్ణోగ్రతలు, గాలిలో తేమశాతం, పంటల సాగు విస్తీర్ణం, ఆటోమేటిక్‌ వెదర్‌బేస్ట్‌ స్టేషన్‌ డేటా ప్రకారం వేరుశనగ హెక్టారుకు రూ.80 వేలు బీమా నిర్ణయించారు. పత్తి హెక్టారుకు రూ.95 వేలు, దానిమ్మకు రూ.1,87,500, అరటికి రూ.1.50 లక్షలు, చీనీ కి రూ.1,37,500, టమాటాకు రూ.80 వేలు ప్రకారం బీమా ఖరారు చేశారు.

● ప్రధాన మంత్రి ఫసల్‌బీమా పథకం కింద పంట దిగుబడి ఆధారంగా మరికొన్ని పంటలకు బీమా వర్తింపజేశారు. జిల్లాలో గ్రామం యూనిట్‌గా కంది పంటను చేర్చారు. మండలం యూనిట్‌గా వరి, జొన్న, మొక్కజొన్న, ఆముదం, ఎండు మిరప పంటలను చేర్చారు. రబీలో పప్పుశనగ, వేరువనగ, వరి, జొన్న, మొక్కజొన్న పంటలకు బీమా వర్తింపజేశారు.

● శ్రీ సత్యసాయి జిల్లాలో ఫసల్‌బీమా కింద గ్రామం యూనిట్‌గా కందిని చేర్చారు. ఖరీఫ్‌లో వరి, మొక్కజొన్న, ఆముదం, రాగి పంటలకు వర్తింపజేశారు. రబీలో వేరుశనగ, వరికి బీమా వర్తింపజేశారు.

12న ఐఏబీ సమావేశం

అనంతపురం సెంట్రల్‌: కలెక్టరేట్‌లో ఈ నెల 12న సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించనున్నట్లు హెచ్చెల్సీ ఎస్‌ఈ రాజశేఖర్‌ తెలిపారు. రెవెన్యూభవన్‌లో ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల ప్రజాప్రతినిధుల హాజరవుతారని పేర్కొన్నారు. ఈ ఏడాది తుంగభద్ర జలాశయం నుంచి 26.368 టీఎంసీలు కేటాయించారన్నారు. ఇందులో తాగునీటికి 10 టీఎంసీలు, 16. 368 టీఎంసీలు సాగునీటికి కేటాయించాల్సి వస్తోందన్నారు. లక్ష ఎకరాల్లో ఆరు తడి పంటలు సాగు చేసుకోవచ్చన్నారు. ఐఏబీలో ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటామన్నారు. చివరి ఆయకట్టుకూ నీరు అందించాలని లక్ష్యం విధించుకున్నట్లు తెలిపారు. ఎక్కువ రోజులు నీటిని అందించడానికి ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతి అమలు, నీటి నిర్వహణకు రెవెన్యూ, పోలీసు, ఇంజినీరింగ్‌ అధికారులతో కమిటీలు, నాలుగు నెలల పాటు తాత్కాలిక లస్కర్ల ఏర్పాటు, 16 అద్దె వాహనాలు తదితర అంశాలను ఐఏబీ అజెండాలో పొందుపర్చినట్లు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement