పర్యాటక అభివృద్ధికి కృషి
లేపాక్షి: జిల్లాలో పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ టీఎస్.చేతన్ తెలిపారు. శుక్రవారం రాత్రి లేపాక్షిలోని వీరభద్రస్వామి ఉత్తర ప్రవేశ ద్వారం వద్ద జిల్లా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో దసరా–2024 సంబరాల ముగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన లేపాక్షి, పెనుకొండ, పుట్టపర్తి, తిమ్మమ్మ మర్రిమానుతో పాటు మడకశిర ప్రాంతంలోని హేమావతి, రత్నగిరి కోట, కదిరి లక్ష్మినరసింహస్వామి దేవాలయం, గోరంట్లలోని మాధవరాయ ఆలయం, కటారుపల్లి యోగి వేమన సమాధి తదితర పర్యటక కేంద్రాలు మన జిల్లాలో ఉండటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ ప్రాంతాలు మన జిల్లాకు గర్వకారణంగా భావితరాలకు తలమానికంగా నిలుస్తున్నాయని తెలిపారు. లేపాక్షి ప్రాంతం దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోందన్నారు. ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ది చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. టూరిజం జిల్లా అధికారి జయకుమార్‌బాబు, మేనేజర్ ప్రతాపరెడ్డి, తహసీల్దార్ సౌజన్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
దసరా సంబరాల్లో కలెక్టర్ టీఎస్.చేతన్
Comments
Please login to add a commentAdd a comment