ప్రశ్నిస్తే కేసులు పెడతారా?
పెనుకొండ రూరల్: ‘ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టడం సరికాదు. విజయవాడ వరద బాధితుల కోసం కేవలం అగ్గిపెట్టెల కోసమే రూ.23 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించడం నిజం కాదా? ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టడం అన్యాయం’ అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. శుక్రవారం మండలంలోని నాగలూరులో సర్పంచ్ సునందమ్మ భర్త గోపాలప్ప మృతి చెందడంతో గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అధైర్య పడొద్దు.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు కూటమి నాయకులు సూపర్ సిక్స్ పథకాలు అంటూ జోరుగా ప్రచారం చేశారని, ప్రస్తుతం ప్రభుత్వం పెట్టిన బడ్జెట్‌లో మాత్రం సంక్షేమ పథకాలకు డబ్బు కేటాయించకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటే రూ.75 వేల కోట్లు అవసరం అవుతాయన్నారు. బీసీ సంక్షేమ పథకాలకు ఎందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదో మంత్రి సవిత ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కే నైజం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌కి లేదన్నారు. ఇచ్చిన మాట ఇచ్చినట్లుగా నిలబెట్టుకొనే నైజం ఒక్క జగన్‌కే ఉందన్నారు. ఆమె వెంట వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ సుధాకర్‌రెడ్డి, మాజీ మండల కన్వీనర్లు బాబు, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్
Comments
Please login to add a commentAdd a comment