ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు
పుట్టపర్తి టౌన్: జిల్లా ప్రజలకు కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పీ రత్న విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. అందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే విజయదశమిని ఆనందంగా జరుపుకోవాలన్నారు. అనుకున్న కార్యాలన్నీ పూర్తయి ప్రజలందరూ సుఖ సంతోషాలు జీవించాలని దుర్గామాతను ప్రార్తిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఫుట్‌బాల్ టోర్నీ
విజేతగా జిల్లా జట్టు
హిందూపురం టౌన్: రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల ఫుట్‌బాల్ పోటీల్లో జిల్లా జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగాయి. ఈ పోటీల్లో రాష్ట్ర నలుమూలల నుంచి 25 జట్లు పాల్గొన్నాయి. సెమీఫైనల్‌లో జిల్లా జట్టు విశాఖపట్నంతో తలపడి విజయం సాధించి ఫైనల్ చేరింది. శుక్రవారం జరిగిన ఫైనల్ పోరులో కర్నూలు జట్టుతో జిల్లా జట్టు తలపడింది. మ్యాచ్ సమయం ముగిసేనాటికి ఇరు జట్లు చెరో గోల్ చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అనంతరం ఇరు జట్లకు ఐదు చొప్పున పెనాల్టీ కిక్స్ ఇచ్చారు. ఇందులో జిల్లా జట్టు మూడు గోల్స్ చేయగా, కర్నూలు జట్టు రెండు గోల్స్ చేసింది. ఒక్క గోల్ తేడాతో జిల్లా జట్టు ఫుట్‌బాల్ టోర్నీ విజేతగా నిలిచింది. జట్టుకు ముఖ్య అతిథులు ట్రోఫీ అందజేశారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతగా నిలిచిన జిల్లా జట్టు క్రీడాకారులను, కోచ్ బీకే మహమ్మద్ సలీమ్, మేనేజర్ ఇర్షాద్ అలీను ఫుట్‌బాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు జేవీ అనిల్ కుమార్ అభినందించారు.
బెలగావి–మణగూరు ఎక్స్‌ప్రెస్ రైళ్ల పునరుద్ధరణ
గుంతకల్లు: బెలగావి–మణగూరు మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లను పునరుద్ధరించినట్లు రైల్వే డివిజన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. బెలగావి నుంచి ఆది, బుధ, శని, మంగళవారాల్లో నడిచే మణగూరు (07335) ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతుంది. ఆ రోజుల్లో మధ్యాహ్నం 12.30 గంటలకు బెలగావి నుంచి బయల్దేరి గుంతకల్లు జంక్షన్‌కు రాత్రి 9.20 గంటలకు చేరుకుంటుంది. ఇక్కడ నుంచి 9.40 గంటలకు బయలుదేరి ఆదోని, మంత్రాలయం, రాయచూర్, వికారాబాద్ మీదుగా సికింద్రాబాద్‌కు మరుసటి రోజు ఉదయం 5.25 గంటలకు చేరుతుంది. అక్కడ నుంచి మణగూరుకు మధ్యాహ్నం 12.50 గంటలకు చేరుతుంది. సోమ, గురు, ఆది, బుధవారాల్లో నడిచే రైలు (07336) ఈ నెల 17న మధ్యాహ్నం 3.40 గంటలకు మణగూరు జంక్షన్‌కు బయలుదేరి రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్‌కు చేరుతుంది. అక్కడ నుంచి రాత్రి 10.20 గంటలకు బయలుదేరి వికారాబాద్, రాయచూర్, మంత్రాలయం, ఆదోని మీదుగా గుంతకల్లు జంక్షన్‌కు మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు చేరుతుంది. ఇక్కడ నుంచి 6.30 గంటలకు బయలుదేరి బెలగావి జంక్షన్‌కు సాయంత్రం 4.00 గంటలకు చేరుతుంది.
టీబీ డ్యాంలో
16 గేట్లు ఎత్తివేత
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. శుక్రవారం సాయంత్రం డ్యాంలో 101.539 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. డ్యామ్ పూర్తిగా నిండటంతో శుక్రవారం ఉదయం 16 క్రస్ట్ గేట్లు అడుగున్నర మేర పైకి ఎత్తి 35,616 క్యూసెక్కుల నీటిని నదికి వదులుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment