87 షాపులు.. 1,460 దరఖాస్తులు
సాక్షి, పుట్టపర్తి: మద్యం దుకాణాల దరఖాస్తు గడువు శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 87 షాపులకు 1,460 దరఖాస్తులు వచ్చాయి. మద్యం దుకాణాలను సొంతం చేసుకోవడంలో టీడీపీ నేతల హవా స్పష్టంగా కనిపిస్తోంది. అక్రమమార్గంలో ఆదాయం ఆర్జించాలనే ఉద్దేశంతో లాటరీ పద్ధతి ఉన్నప్పటికీ ఎవరినీ దరఖాస్తు చేయనీయకుండా అడుగడుగునా అడ్డుకున్నారు. దరఖాస్తులు చేసిన వారిలో 80 శాతం మంది అధికార పార్టీ అనుయాయులే ఉండటం గమనార్హం. మిగతా 20 శాతం మంది రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా బరిలో దిగారు. అయితే వారందరికీ ఇప్పటికే వార్నింగ్‌లు వెళ్లినట్లు తెలిసింది. ఒకవేళ లాటరీలో దుకాణం దక్కించుకున్నా వదిలి వెళ్లాల్సిందేనంటూ బెదిరింపులకు దిగినట్లు సమాచారం.
ఆరంభం నుంచే బెదిరింపులు..
మద్యం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి టీడీపీ నేతలు బెదిరింపులు మొదలుపెట్టారు. ఎవరు దరఖాస్తు చేసినా ఖబడ్దార్ అంటూ ఫోన్లలో వార్నింగ్ ఇచ్చారు. దీంతో చాలామంది ఔత్సాహికులు వెనక్కి తగ్గారు. కాగా ఆన్‌లైన్ విధానం అందుబాటులో ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి దరఖాస్తులు చేశారు. అయితే లాటరీలో ఎవరు దక్కించుకున్నా తమకు ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఇలాంటి ఘటనలు హిందూపురం, కదిరి, మడకశిరలో ఎక్కువగా వెలుగు చూశాయి. కొత్తచెరువులో భారీగా దరఖాస్తులు వచ్చినప్పటికీ కమ్మ సామాజిక వర్గానిదే పెత్తనం సాగుతున్నట్లు తెలిసింది. ధర్మవరం, పెనుకొండలో మంత్రి అనుచరులు నెలవారీ మామూళ్లు, పర్సెంటేజీల రూపంలో మాట్లాడుకున్నట్లు సమాచారం.
‘తమ్ముళ్ల’ కనుసన్నల్లోనే..
జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు టెండర్ వేసే ప్రక్రియ మొత్తం ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, వారి పీఏలు, అనుచరుల కనుసన్నల్లోనే జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతి దుకాణం తమకు.. తమ అనుచరులు.. తాము చెప్పిన వారికే దక్కే విధంగా టీడీపీ నేతలు ముందస్తు ప్లాన్ చేశారు. దీంతో ఆరంభం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగింది.
చివరి రోజు భారీగా దరఖాస్తులు..
నూతనంగా ఏర్పాటు కానున్న ప్రైవేటు మద్యం దుకాణాలకు దక్కించుకొనేందుకు దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. జిల్లాలోని 87 దుకాణాలకు సంబంధించి మొత్తం 1,460 దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు.
14న లక్కీ డ్రా..
జిల్లాకు సంబంధించి పుట్టపర్తిలోని సాయి ఆరామంలో కలెక్టర్ చేతన్ అధ్యక్షతన ఈనెల 14న లాటరీ విధానంలో దుకాణాలకు అనుమతులు మంజూరు చేస్తారు. 15న పాత పాలసీ రద్దు చేసి కొత్త పాలసీ ప్రారంభిస్తారు. ఈనెల 16వ తేదీ నుంచి కొత్త విధానం అమలు కానుంది.
ముగిసిన మద్యం దరఖాస్తుల గడువు
ఎల్లుండి లక్కీ డ్రా
Comments
Please login to add a commentAdd a comment