కర్ణాటక తొలి విజయం
అనంతపురం: సంతోష్ ట్రోఫీ తాజా సీజన్‌లో కర్ణాటక, తమిళనాడు జట్లు తొలి విజయం నమోదు చేసుకున్నాయి. శుక్రవారం అనంత క్రీడాగ్రామం వేదికగా జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుపై 5–0 గోల్స్ తేడాతో కర్ణాటక జట్టు భారీ విజయాన్ని నమోదు చేయగా... రెండో మ్యాచ్‌లో అండమాన్ నికోబార్ జట్టుపై 7–0 గోల్స్ తేడాతో తమిళనాడు జట్టు గెలుపొందింది. జోరున కురుస్తున్న వర్షంలోనే మ్యాచ్‌లు హోరాహోరీగా సాగడం గమనార్హం.
చెలరేగిన కన్నడిగులు..
ప్రత్యర్థి డిఫెన్స్ బలహీనతలను సొమ్ము చేసుకుంటూ కర్ణాటక జట్లు క్రీడాకారులు చెలరేగిపోయారు. ఆట ప్రారంభమైన తొలి 15 నిమిషాల వ్యవధిలోనే ఆంధ్ర జట్టుపై మూడు గోల్స్ చేసి ఆధిక్యతలో కొనసాగారు. దీంతో ఒత్తిడికి గురైన ఆంధ్ర క్రీడాకారులు కేవలం డిఫెన్స్‌కే పరిమితమవుతూ వచ్చారు. బంతిని ఎక్కువ సేపు అదుపులో పెట్టుకున్నా... అవి గోల్ కాకుండా కర్ణాటక క్రీడాకారులు అడ్డుకోవడం గమనార్హం. అనూహ్యంగా దక్కిన కార్నర్‌లు, ఆఫ్‌సైడ్‌లను సద్వినియోగం చేసుకోలేక చతికిలబడ్డారు. దీంతో రెండో హాఫ్‌లో మరో రెండు గోల్స్ చేసి కర్ణాటక శుభారంభం చేసింది.
తమిళుల ధాటికి తాళలేక...
రెండో మ్యాచ్‌లో తమిళనాడు జట్టు ముందు పేలవమైన ఆటతీరుతో అండమాన్ నికోబార్ జట్టు చతికిలబడింది. ఆట ప్రారంభం నుంచి అండమాన్ నికోబార్ జట్టుపై తమిళనాడు క్రీడాకారులు ఆధిక్యతను కొనసాగిస్తూ 7–0 గోల్స్ తేడాతో భారీ విజయాన్ని నమోదు చేశారు. అనంత క్రీడాగ్రామంలోని ఫుట్‌బాల్ స్టేడియంలో ఈ సీజన్‌కు ఇదే భారీ విజయం కావడం విశేషం.
ఫుట్‌బాల్‌కు విపరీతమైన క్రేజ్..
ప్రపంచంలో ఫుట్‌బాల్ క్రీడకు విపరీతమైన క్రేజ్ ఉందని జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏపీఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో అనంత క్రీడాగ్రామం వేదికగా ఆర్డీటీ స్టేడియంలో సంతోష్ ట్రోఫీ–24 శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. కళ్యాణ్ చౌబే, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డేనియల్ ప్రదీప్, ఆర్డీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంఛోఫెర్రర్ తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరై టోర్నీని ప్రారంభించారు. కళ్యాణ్ చౌబే మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో ఫుట్‌బాల్ క్రీడాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. జేసీ శివనారాయణ శర్మ మాట్లాడుతూ.. సంతోష్ ట్రోఫీ టోర్నీని జిల్లాలో నిర్వహించడం గర్వకారణమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment