సర్టిఫికెట్ల కోసం సమరం!
బత్తలపల్లి: జనన ధ్రువీకరణ సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు సమరం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) కార్డు కోసం విద్యార్థులు తల్లిదండ్రులు పడరానిపాట్లు పడుతున్నారు. ఆధార్‌లో చిన్నచిన్న మార్పులకోసం జనన ధ్రువీకరణ పత్రం అవసరం కావడంతో రోజుల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సాంకేతిక సమస్య, కొందరు ఉద్యోగులు నిర్లక్ష్యంతో కార్యాలయాల వద్దే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు విధిలేని పరిస్థితిలో రోడ్డెక్కి నిరసన బాట పట్టారు. మంగళవారం బత్తలపల్లిలోని గ్రామ సచివాలయ సమీపాన బత్తలపల్లి–తాడిపత్రి ప్రధాన రహదారిపై దాదాపు గంట పాటు సచివాలయ ఇబ్బంది, అధికారుల నిర్లక్ష్యవైఖరిని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. దీంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.
ఆర్డీటీ ఆస్పత్రిలోనే ఎక్కువ ప్రసవాలు..
బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రిలో ప్రసవాల కోసం ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. దీంతో ఇక్కడ ప్రసవమైన వారందరికీ జనన ధ్రువీకరణ పత్రం స్థానిక పంచాయతీ అధికారులే ఇవ్వాల్సి ఉంటుంది. ఏవైనా మార్పులు చేయాలన్నా మళ్లీ ఇక్కడికే రావాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఇటీవల కేంద్రం ‘అపార్’ కార్డు కోసం వివరాలు సేకరిస్తోంది. ఇందుకు బర్త్ సర్టిఫికెట్‌ను ప్రామాణికంగా తీసుకుంటుండడంతో వాటిని పొందడానికి విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజూ కార్యాలయానికి జనం పోటెత్తుతున్నా...అధికారులు తగు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో విసిగిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. 20 రోజుల నుంచి కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నామని వివిధ పట్టణాలకు చెందిన వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయంలోని ఓ ఉద్యోగి డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న బత్తలపల్లి ఏఎస్‌ఐ సోమశేఖర్, పంచాయతీ కార్యదర్శి నారాయణస్వామి తదితరులు విద్యార్ధుల తల్లిదండ్రులతో చర్చించారు. అదనపు సిబ్బందిని నియమించి సకాలంలో జనన సర్టిఫికెట్‌లు అందజేస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన విరమించారు.
జనన ధ్రువీకరణ పత్రాల జారీలో
తీవ్ర జాప్యం
అధికారుల తీరును నిరసిస్తూ
రోడ్డుపై బైఠాయించిన జనం
గంటపాటు నిరసనతో రాకపోకలకు అంతరాయం
Comments
Please login to add a commentAdd a comment