తేమ అధికం.. ధర పతనం
హిందూపురం అర్బన్: ఫెంగల్ తుపాను ఎండుమిర్చి రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. కుటుంబంతో కలిసి రెక్కలుముక్కలు చేసుకుని పంటను కాపాడుకున్న రైతులు దిగుబడి చూసి మురిసిపోయారు. మార్కెట్‌లో ధరలు కూడా కాస్త అటుఇటుగా ఉండగా నష్టాల నుంచి బయటపడతామని భావించారు. కానీ తుపాను తీవ్రంగా దెబ్బతీసింది.
ముసురుతో ధరల పతనం..
తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మబ్బులు కమ్ముకొని తేలిక పాటి వర్షాలు కురుస్తున్నాయి. ఎంతగా పంటను కాపాడుకోవాలనుకున్నా.. వాతావరణంలో తేమశాతం ఎక్కువైంది. దీంతో ఎండుమిర్చి మెత్తగా మారిపోయింది. తప్పసరి పరిస్థితుల్లో మార్కెట్‌కు తీసుకురాగా, నాణ్యత పేరుతో వ్యాపారులు ధరలో కోత పెడుతున్నారు. దీంతో ఎండుమిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు.
క్వింటా రూ.14 వేలు..
మంగళవారం హిందూపురం వ్యవసాయ మార్కెట్‌కు 93 క్వింటాళ్ల ఎండుమిర్చి రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం వేశారు. ఇందులో మొదటి రకం ఎండుమిర్చి క్వింటా రూ.14 వేలు, రెండో రకం క్వింటా రూ.9 వేలు, మూడోరకం ఎండుమిర్చి క్వింటా రూ. 8 వేల చొప్పున ధర పలికాయి. గత వారం మెదటి రకం మిర్చి క్వింటా రూ.18 వేలు పలకగా, వారం రోజుల్లోనే క్వింటాపై రూ.4 వేలు పడిపోయింది. ధర రోజురోజుకూ తగ్గిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
తగ్గిన ఎండుమిర్చి ధర
వారంలోనే క్వింటాపై
రూ.4 వేలు తగ్గుదల
Comments
Please login to add a commentAdd a comment