ధర్మవరం పట్టుచీర అద్భుతం
● నేతన్న పనితనానికి ముగ్ధులైన
ఢిల్లీ నిపుణుల కమిటీ సభ్యులు
ధర్మవరం: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధర్మవరం పట్టుచీర అద్భుతంగా ఉందని ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల బృందం కితాబు ఇచ్చింది. ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’ అవార్డు కోసం స్థానిక డిజైనర్ నాగరాజు దరఖాస్తు చేసుకోగా, మంగళవారం ఢిల్లీ నుంచి ఓ బృందం ధర్మవరానికి వచ్చింది. కమిటీ సభ్యులు అరిష్టి గుప్త, జాస్మిన్ కౌర్ ధర్మవరంలో విస్తృతంగా పర్యటించారు. పట్టు గుడ్డు నుంచి పట్టుచీర తయారీ వరకు వివిధ దశలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నేతన్నల పనితనానికి ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతినిధులు ముగ్ధులయ్యారు. వారివెంట హ్యాండ్‌లూమ్ ఏడీ రామకృష్ణ, డీఓ రమణరెడ్డి, శీనా నాయక్, బీజేపీ నాయకులు జింక చంద్రశేఖర్, చేనేత కార్మికులు సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
బుక్కపట్నం ఎంఈఓ
లైంగికంగా వేధిస్తున్నాడు
● ఎంజేపీ బాలిక పాఠశాల
సహాయకురాలి ఫిర్యాదు
● కేసు నమోదు చేసిన పోలీసులు
పుట్టపర్తి: బుక్కపట్నం ఎంఈఓ–1 గోపాల్ నాయక్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని
మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో సహాయకురాలు (అటెండర్)గా పని చేస్తున్న తాత్కాలిక ఉద్యోగిని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంఈఓపై కేసు నమోదు చేసినట్లు బుక్కపట్నం ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు. ఎంఈఓ గోపాల్‌నాయక్ ఇటీవల తనను అనేక సార్లు తన కార్యాలయానికి పిలిపించుకుని వేధింపులకు గురి చేసినట్లు బాధితురాలు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పాఠశాలకు సంబంధించి వివరాల సేకరణ నిమిత్తం తన ఫోన్ నంబర్ తీసుకున్న ఎంఈఓ... అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడంతో పాటు వాట్సాప్ ద్వారా వీడియోకాల్ చేసి వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఈ కేసు నుంచి ఎంఈఓను తప్పించేందుకు స్థానిక టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్‌లో దుప్పటి పంచాయితీ నిర్వహించారు. అయితే బాధితురాలు ఒప్పుకోకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
బాబయ్య దర్గా పీఠాధిపతిగా సలావుద్దీన్‌బాబా
పెనుకొండ: ప్రసిద్ధిగాంచిన పెనుకొండ బాబయ్య దర్గా 22వ పీఠాధిపతిగా ప్రస్తుత పీఠాధిపతి తాజ్‌బాబా పెద్ద కుమారుడు నజర్‌హుస్సేని అలియాస్ సలావుద్దీన్ బాబా నియమితులయ్యారు. గత 36 సంవత్సరాలుగా దర్గా పీఠాధిపతిగా తాజ్‌బాబా బాధ్యతలు నిర్వర్తించారు. వంశపారంపర్యంగా వస్తున్న పీఠాధిపతి స్థానాన్ని తన కుమారుడు సలావుద్దీన్‌బాబాకు ఆయన అప్పగించారు. మంగళవారం సాయంత్రం పీఠాధిపతి స్థానంపై సలావుద్దీన్‌బాబా ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా పలువురు మత పెద్దలు, భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
మహాకుంభమేళాకు
ప్రత్యేక రైలు
రాయదుర్గం టౌన్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే మహా కుంభమేళాకు నెలలో రెండు ట్రిప్పుల చొప్పున రాయదుర్గం, బళ్లారి మీదుగా మైసూరు–దానాపూర్–మైసూర్ ప్రత్యేక రైలును నడపనున్నారు. ఈ మేరకు సౌత్ వెస్ట్రన్ రైల్వే హుబ్లీ డివిజన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మంజునాథ మంగళశారం ఓ ప్రకటన విడుదల చేశారు. జనవరి 18, ఫిబ్రవరి 15, మార్చి 1 తేదీ శనివారాల్లో మైసూరులో సాయంత్రం 4.30 గంటలకు రైలు (06207) బయలుదేరి బెంగళూరు, చిత్రదుర్గం, రాయదుర్గం, బళ్లారి కంటోన్మెంట్, హుబ్లీ, విజయపుర, సత్నా, ప్రయాగ్‌రాజ్ మీదుగా దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్‌కు చేరుకుంటుంది. అలాగే జనవరి 22న, ఫిబ్రవరి 19, మార్చి 5న వేకువజాము 1.45 గంటలకు బయలుదేరే రైలు (06208) అదే స్టేషన్ల మీదుగా మైసూరుకు చేరుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment