జనంపై ‘చలి’ పంజా
● రికార్డుస్థాయిలో పడిపోతున్న
రాత్రి ఉష్ణోగ్రతలు
అనంతపురం అగ్రికల్చర్: చలి పంజా విసురుతోంది. రోజురోజుకు చలితీవ్రత పెరుగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు పతనమవుతున్నాయి. మంగళవారం మరింత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. మడకశిరలో 9.3 డిగ్రీలు, కుందుర్పిలో 10 డిగ్రీల నమోదుతో ఈ సీజన్‌లో కనిష్టం రికార్డయ్యాయి. అలాగే, బెళుగుప్ప 10.1 డిగ్రీలు, కంబదూరు 10.3, గుత్తి 10.4, శెట్టూరు 10.9, గుమ్మఘట్ట 11.1, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రంలో 11.7 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో 12 నుంచి 15 డిగ్రీల లోపు నమోదయ్యాయి. అటు శ్రీ సత్యసాయి జిల్లాలోని పరిగిలో 10.7 డిగ్రీలు, సోమందేపల్లి 10.9, గుడిబండ 11.2, అగళి 11.3, చిలమత్తూరు 11.4, రొద్దం 11.5, అమరాపురం 11.6 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో 12 నుంచి 14 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. మడకశిర, హిందూపురం, పెనుకొండ, కళ్యాణదుర్గం ప్రాంతాలు చలిగుప్పిట్లో వణుకుతుండగా రాయదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, అనంతపురం డివిజన్లలో కూడా తీవ్రత అధికంగా ఉంది. సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు కూడా పొగమంచు కారణంగా చీకట్లు అలుముకుంటున్నాయి. నీరెండ కారణంగా పగలంతా కూడా చలి వాతావరణం కనిపిస్తోంది.
జాగ్రత్తలు తప్పనిసరి: అతి శీతల పరిస్థితులు అన్ని వర్గాలను వణికిస్తున్నాయి. పిల్లలు, వృద్ధులు, ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు, రైతులు, శ్రామికులు, పాలు, కూరగాయల అమ్మకందారులు మరింత ఇబ్బంది పడుతున్నారు. చలి బారి నుంచి రక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏసీలు, ఫ్యాన్లు తగ్గించేయాలని సూచిస్తున్నారు. మఫ్లర్లు, మంకీక్యాప్, మాస్కులు, గ్లౌజులు, ఉన్ని సంబంధిత దుస్తులు వాడాలి. విటమిన్–డీ లోపం ఉన్న వారు ఎండలో వాకింగ్ చేయాలి. కాచివడబోసిన నీళ్లు తాగాలని, వేడి, తాజా ఆహార పదార్థాలు తీసుకోవాలి. జలుబు, దగ్గు, జ్వరాల బారి నుంచి రక్షించుకోవాలి.
ఖైదీల ఆరోగ్యానికి
ప్రాధాన్యత ఇవ్వాలి
● డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్
కదిరి టౌన్: ఖైదీల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఎప్పటికప్పుడు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ స్థానిక సబ్‌జైలు అధికారులను ఆదేశించారు. మంగళవారం డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ స్థానిక సబ్‌జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. 70 ఏళ్లు వయస్సు ఉన్న ఖైదీలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఖైదీలతో మాట్లాడారు. అనంతరం వంటశాల గదులు, ఖైదీలు ఉండే బ్యారక్‌లను పరిశీలించారు. పలు రికార్డులను తనిఖీ చేశారు. ఆయన వెంట న్యాయవాదులు లింగాల లోకేశ్వర్‌రెడ్డి, సిరాజుద్దీన్, దశరథ నాయక్, రఘునాథ్, జైలు సూపరింటెండెంట్ వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment