ఫ్రీ హోల్డ్ సర్వే పక్కాగా సాగాలి
ప్రశాంతి నిలయం: జిల్లాలో జరుగుతున్న ఫ్రీ హోల్డ్ సర్వే పక్కాగా సాగాలని, ఎక్కడైనా తప్పులు దొర్లితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ టీఎస్ చేతన్ హెచ్చరించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లోని కోర్టు హాలు నుంచి వివిధ రెవెన్యూ అంశాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఫ్రీ హోల్డ్ వెరిఫికేషన్ శుక్రవారంలోపు పూర్తి చేయాలన్నారు. ఇప్పటికీ కొన్ని డివిజన్లలో పరిశీలన నత్తనడకన సాగుతోందని, వెంటనే సంబంధిత ఆర్డీఓలు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్డీఓలంతా తహసీల్దార్లను సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో ఫ్రీహోల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని మండలాల్లో పెండింగ్‌లో ఉన్న 22ఏ జాబితా ఈ నెల 23వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. తహసీల్దార్లు కిందిస్థాయి సిబ్బందికి రోజువారీ లక్ష్యాలను నిర్దేశించి వాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్‌ఓ విజయసారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
నియోజకవర్గానికో నగరవనం
జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. నగర సుందరీకరణ చర్యల్లో భాగంగా నియోజకవర్గానికో నగరవనం ఏర్పాటు చేయాలన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో అటవీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇటీవల ముఖ్యమంత్రితో జరిగిన కలెక్టర్ల సదస్సులో జిల్లాలో అడవుల విస్తీర్ణం పెంచడంతో పాటు పచ్చదనం పెంపొందించే చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ, గ్రామీణ ఉపాధి హామీ అధికారులను సమన్వయం చేసుకుని అడవుల్లో కాంటూరు కందకాలు, రాక్ ఫీల్ డ్యాములు, చిన్న చిన్న నీటి గుంతలు ఏర్పాటు చేయాలన్నారు. 2025–2030కి సంబంధించి అటవీకరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. అలాగే జిల్లా మీదుగా వెళ్లే అన్ని జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం విస్తృతం చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి చక్రపాణి, సామాజిక వన విభాగం అధికారి వినోద్ కుమార్, సబ్ డీఎఫ్‌ఓ అనంద్ తదితరులు పాల్గొన్నారు.
‘సూర్యఘర్’పై విస్తృత అవగాహన కల్పించాలి
‘పీఎం సూర్యఘర్’ పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కోర్ట్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన ‘సీఎం సూర్యఘర్’ పథకం అమలుపై డీఎల్సీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ‘సూర్యఘర్’ పథకం అమలులో భాగంగా మోడల్ సోలార్ విలేజ్‌ను గుర్తించాలన్నారు. ఈ పథకానికి దరఖాస్తుల లక్ష్యాన్ని 10 వేలకు పెంచాలన్నారు. గ్రామ సభలు నిర్వహించి సోలార్ విద్యుత్ ఉత్పత్తితో వినియోగదారుడు అదనపు ఆదాయం పొందవచ్చన్న అంశాన్ని తెలియజేయాలన్నారు. సోలార్ గ్రామాలకు కేంద్రం రూ.కోటి ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ సురేంద్రబాబు, సంప్రదాయేతర ఇంధన వనరుల అధికారి కిషోర్, గ్రామ/వార్డు సచివాలయాల నోడల్ అధికారి సుధాకర్ రెడ్డి, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి హరి కిరణ్, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
తప్పులు దొర్లితే కఠిన చర్యలు : కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment