విద్యుత్ పొదుపు.. భవితకు మలుపు
పుట్టపర్తి టౌన్: విద్యుత్‌ను పొదుపుగా వాడుకుంటే భవితరాలకు ఎంతో మేలు జరుగుతుందని, అందువల్ల విద్యుత్ వినియోగంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్‌లో ర్యాలీకి కలెక్టర్ టీఎస్ చేతన్ జెండా ఊపి ప్రారంభించగా, గణేష్ కూడలి వరకు కొనసాగింది. అక్కడ మానవహారంగా ఏర్పడి ‘విద్యుత్‌ను పొదుపు చేద్దాం–భావితరాలకు భవిష్యత్ నిద్దాం’ అంటూ నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యుత్ పొదుపు చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గృహోపకరణాలు ఉపయోగించే సమయంలో చిట్కాలు పాటించడం ద్వారా విద్యుత్ ఆదా చేయవచ్చన్నారు. అనంతరం ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ సురేంద్ర మాట్లాడుతూ, నాణ్యమైన విద్యుత్ సరఫరాకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ డీఈ శివరాం, ఏడీ శర్వాణ్, ఏఈలు నారాయణమ్మ, శ్రీనివాసులుతో పాటు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇంధన వారోత్సవాల్లో కలెక్టర్
టీఎస్ చేతన్
Comments
Please login to add a commentAdd a comment