‘రాష్ట్రీయ బాల స్వాస్థ్య’ను విజయవంతం చేయండి
పుట్టపర్తి అర్బన్: పిల్లల్లో ఆరోగ్య సమస్యలను చిన్న వయస్సులోనే గుర్తించేందుకు ఏర్పాటు చేసిన రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ మంజువాణి ఓ ప్రకటనలో కోరారు. ఈ కార్యక్రమాన్ని నవంబర్ 15న జిల్లాలో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 0–18 వయస్సులో అంగన్‌వాడీ, పాఠశాలల్లో ఉన్న పిల్లలకు 41 అంశాలలో 4డీ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. మొదటి స్థాయిలో హెల్త్ టీం పాఠశాలలకు వెళ్లి పిల్లలకు తల నుంచి పాదాల వరకూ పరీక్షిస్తారన్నారు. రెండోస్థాయిలో వైద్యులు ప్రతి గురు, శని వారాల్లో మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్యలో రోజుకు 30 మంది చొప్పున స్క్రీనింగ్ చేస్తారన్నారు. అవసరమైన వారికి అక్కడే మందులు అందిస్తారని పేర్కొన్నారు. చికిత్స అవసరమైన వారిని దగ్గర్లోని ఆస్పత్రులకు రెఫర్ చేస్తారన్నారు. ఇంకా వైద్యం అవసరమైన వారికి వారి తల్లిదండ్రులతో కలిపి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్తారని తెలిపారు. మూడు పీహెచ్‌సీలకు కలిపి ఒక వాహనం ఏర్పాటు చేస్తారన్నారు. జిల్లాలో 2,822 అంగన్‌వాడీ కేంద్రాల్లో 1,10,652 మంది, 2053 పాఠశాలల్లో 1,54,255 మంది పిల్లలకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకూ 49,346 మంది పాఠశాల, 60,526 మంది అంగన్‌వాడీ చిన్నారులకు స్క్రీనింగ్ పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు.
ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడికి మూడేళ్ల జైలు
చిలమత్తూరు: ప్రేమ పేరుతో బాలికను వేధించిన ఓ యువకుడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష పడింది. చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఎస్. నరసప్ప కుమారుడు ఎస్. మధు అదే గ్రామానికి చెందిన బాలికను ప్రేమ పేరుతో వేధించేవాడు. బాలికను, ఆమె తల్లిని అంతు చూస్తా అని బెదిరించేవాడు. దీనిపై బాలిక ఫిర్యాదు మేరకు 2021లో చిలమత్తూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అనంతపురం పోక్సో కోర్టులో కేసు విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదోపవాదనలు విన్న స్పెషల్ జడ్జి రాజ్యలక్ష్మి గురువారం తీర్పు వెలువరించారు. నేరం రుజువు కావడంతో నిందితుడు ఎస్. మధుకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించారు. అలాగే బాధిత యువతికి ప్రభుత్వం తరఫున రూ.50 వేలు చెల్లించాలని ఆదేశించారు. ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పీపీ ఈశ్వరమ్మ వాదించారు. కోర్టు లైజెన్ ఆఫీసర్ శ్రీనివాసులు (ఏఎస్‌ఐ), చిలమత్తూరు పోలీస్‌స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ గురుస్వామి, స్పెషల్ పీపీ ఈశ్వరమ్మను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
ఆంధ్రా జట్టుకు ఎంపిక
అనంతపురం: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే అండర్–19 ఉమెన్ వన్డే క్రికెట్ టోర్నీలో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టుకు జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారిణులు ఎంపికయ్యారు. ఆర్డీటీ స్పోర్ట్స్ అకాడమీకి చెందిన బి.నేహ, ఎస్.ఆశ్రియ (కదిరి) ఉన్నారు. కేరళలోని త్రివేండ్రమ్ వేదికగా జనవరి 4 నుంచి 12వ తేదీ వరకూ మ్యాచ్‌లు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment