● అక్రమాల్లో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుల్, వీఆర్వో
ఉరవకొండ: నియోజకవర్గంలో పెద్దఎత్తున పట్టుబడిన రేషన్ బియ్యం కేసులో అక్రమార్కులకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అండగా నిలిచారు. ఇందుకు గాను డీటీ, పోలీస్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి బియ్యాన్ని పక్కదారి పట్టించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు...ఈ ఏడాది అక్టోబర్ 8న ఉరవకొండ శివారులోని రాములమ్మ ఆలయం వద్ద ఐచర్ వాహనం, ఆటోల్లో రేషన్ బియ్యాన్ని లోడ్ చేస్తున్నట్లుగా సమాచారం అందుకున్న అప్పటి సీఐ సురేష్‌బాబు, పోలీసులు అక్కడకు చేరుకుని వాహనాలను స్టేషన్‌కు తరలించారు. 140 బస్తాల్లో 68 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. అనంతరం పీఎస్‌లో అంతా తానై దుప్పటి పంచాయితీలకు తెరలేపే ఓ కానిస్టేబుల్ ఈ అంశంలో జోక్యం చేసుకుని అధికారులకు తెలియకుండా డిప్యూటీ తహసీల్దార్, అప్పటి సీఐ సంతకాన్ని ఫోర్జరీ చేసి 68 క్వింటాళ్ల బియ్యంలో కేవలం 30 క్వింటాళ్లను మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు రికార్డులు చూపించాడు. మిగిలిన 38 క్వింటాళ్ల బియ్యాన్ని పక్కదారి పట్టించాడు. ఈ వ్యవహారంలో ఓ వీఆర్వో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోర్జరీ వ్యవహారం రెండు రోజుల క్రితం వెలుగుచూడడంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా విచారణ చేపట్టారు. దీనిపై తహసీల్దార్ మహబూబ్‌బాషాను వివరణ కోరగా ఫోర్జరీ సంతకాల అంశం వాస్తవమేనని నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment